Cholera Spreading in AP Due to Contaminated Water: తాగునీరు కలుషితమై తలెత్తే రకరకాల అంటువ్యాధులకు అదనంగా కలరా తోడవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాపాలు శాపాలై ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాష్ట్రంలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 20 జిల్లాల్లో 118 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో కలుషిత నీరు వల్ల 64, ఫుడ్ పాయిజన్ వల్ల 54 కేసులు ఉన్నాయి. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 4,006 డయేరియా కేసులు నమోదుకాగా 15 మంది మృతి చెందారు. కలుషిత నీటికేసుల్లో బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షిస్తే 79 కలరా కేసులు బయటపడ్డాయి.
పట్టణాలు, గ్రామాల్లో మంచినీటి పైపులైన్లకు రంధ్రాలు పడి వాటిలోకి మురుగునీరు ప్రవేశిస్తుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. వైద్యులు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలు పలు ప్రాంతాల్లోని పరిస్థితులను ఇటీవల పరిశీలించారు. కలరా నియంత్రణ చర్యలు పటిష్ఠంగా తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. సాధారణంగా కలుషిత ఆహారం, నీటితో కలరా వ్యాప్తి చెందుతుంది. కనుమరుగైనట్లు భావిస్తున్న తరుణంలో మళ్లీ కలరా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో నిర్వహణ సక్రమంగా లేక దెబ్బతిన్న పైపుల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. యుద్ధప్రతిపాదికన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది.
జామపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు- డ్రాగన్ ఫ్రూట్ బరువు నియంత్రిస్తుందా? - GUAVA and DRAGON FRUIT
ఏమిటీ కలరా: విబ్రియో అనే బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగిన కొద్దిగంటల్లోనే నీళ్ల విరేచనాలతో బాధితుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కలరా బ్యాక్టీరియా సోకినప్పుడు 80శాతం మందిలో మామూలు విరేచనాల సమస్యలానే ఉంటుంది. మిగిలినవారిలో ఇది తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కలరా శరీరంలో చేరి, చిన్నపేగులోకి వెళ్లి, విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం అయితే కలరా లక్షణంగా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో కలరాతోపాటు టైఫాయిడ్, హెపటైటిస్-ఎ, లెఫ్టోస్పైరోసిస్, క్రిప్టోస్పోరిడియోసిస్ వంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ-కోలి బ్యాక్టీరియా సోకినవారికి కూడా విరేచనాలు అవుతాయి.
గుంటూరు నుంచి గుర్ల వరకు: గుంటూరులో ఈ ఏడాది మార్చిలో 2 విబ్రియో కలరా కేసులు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కొలమాసినపల్లి, కాకినాడ జిల్లా అచ్యుతాపురం, కొమ్మనాపల్లి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ మొగల్రాజపురంలో కలరా కేసులు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా గుర్లలో ఒకరు, ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున డయేరియాతో ప్రాణాలు విడిచారు.
విజయనగరం జిల్లా గుర్లలో 950 కటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ 202 మంది డయేరియా బారిన పడ్డారు. ఇక్కడ ఏకంగా 26 విబ్రియో కలరా, 25 ఈ-కోలి కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామంలో మురుగునీటితో మంచినీటి పైపులు సావాసం చేస్తున్నాయి. చంపావతి నది దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. సెప్టిక్ ట్యాంకుల వద్దే బోర్లున్నాయి. కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలోనూ ఇదే పరిస్థితి.
గుర్లలో విజృంభించిన డయేరియా - ఒక్కరోజే నలుగురి మృతి
తాగునీటి పైపుల వ్యవస్థ దారుణం: తాగునీటి పైపులు మురుగు కాల్వల గుండా వెళ్లడం సమస్యగా మారింది. చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడి, వాటిద్వారా కాలుష్యకారకాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో కొన్నిచోట్ల తుప్పుపట్టిన పైపుల ద్వారానే మంచినీరు సరఫరా అవుతోంది. ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఆ ట్యాంకులకు మెట్లు సక్రమంగా లేవు. నీటి శుద్ధికి క్లోరినేషన్ జరగడంలేదు. ప్రభుత్వం సరఫరా చేసే నీటిలో చాలాచోట్ల మోతాదుకు మించి రసాయనాలు, లోహ అవశేషాలు ఉంటున్నాయి. తాగునీరు చిట్టచివరి ఇంటికి చేరేసరికి క్లోరిన్, ఆమ్లశాతాలు తగ్గి నీటి స్వచ్ఛత తగ్గిపోతోంది. ఆ ప్రభావం ఇప్పుడు కలరా రూపంలో బయటపడుతోంది.