Chiranjeevi Speech in Padma Awardees Felicitation Program : నంది అవార్డులను చాలా కాలంగా నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ పురస్కారాలుగా (Gaddar Awards in Telangana) మార్చడం ఎంతో సముచితం, ఆనందమని పేర్కొన్నారు. గద్దర్ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషదాయకమని చెప్పారు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికగా జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ - అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఏమన్నారంటే?
Padma Awardees Felicitation Program in Hyderabad : తనకు పద్మ విభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదని చిరంజీవి (Chiranjeevi) వెల్లడించారు. అభిమానుల అశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని అనిపిస్తుందని తెలిపారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని చెప్పారు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. వాజ్‌పేయీ అంత హుందాతనం వెంకయ్యనాయుడిలో ఉందని కొనియాడారు. వివిధ రంగాల్లోని గొప్ప వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ప్రకటించడం సంతోషమని చిరంజీవి వివరించారు.
"బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎందరినో పద్మ అవార్డుల పేరిట గుర్తించడం సంతోషకరం. కళాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మొదట పద్మశ్రీ విజేతలను, తర్వాత గంటన్నరకు పద్మ విభూషణ్ విజేతలను ప్రకటించారు. అలా గంటన్నర వ్యవధి తర్వాత ప్రకటించడం మోదీ వ్యూహమని తర్వాత తెలిసింది. మొదట పద్మశ్రీ విజేతల గురించి చర్చ జరగాలనే మోదీ అలా చేయించారని తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు మోదీపై గౌరవం మరింత పెరిగింది." - చిరంజీవి, సినీ నటుడు
CM Revanth Reddy felicitated Padma Awardees : అంతకు ముందు ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. పద్మ అవార్డు విజేతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా సన్మానించారు. పద్మ విభూషణ్ పురస్కార విజేతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవితో పాటు పద్మశ్రీ విజేతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, డి.ఉమామహేశ్వరిలను శాలువాతో సత్కరించిన సీఎం, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే