Trees uprooted after Cloud Burst in Mulugu : ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ పరిధిలో క్లౌడ్ బరస్ట్‌తో పాటు భారీ గాలులు వీయడంతో పెద్దఎత్తున వృక్షాల విధ్వంసం జరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) డోబ్రియాల్ వెల్లడించారు. ఈ మేరకు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో 50 వేలకు పైగా చెట్లు కూలిపోయాయని తెలిపారు. ఆగస్టు 31న శనివారం సాయంత్రం తాడ్వాయి, పస్రా అడవుల్లో జరిగిన ఘటనపై పీసీసీఎఫ్ ఈ నెల 4వ తేదిన వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ నివేదిక రూపొందించి అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీంకు శనివారం సాయంత్రం అందించారు.
ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికీ పంపించాలని కోరారు. ఈ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్‌కు దారితీసే వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని, మేఘాలు కిందికి ఎందుకు వచ్చాయన్న విషయంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ), లేదా వాతావరణశాఖతో అధ్యయనం చేయించాలని సూచించారు. వన్యప్రాణులకు ఎలాంటి ముప్పూ కలగలేదని తెలిపారు.
నివేదికలోని అంశాలు
- ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా రేంజి దట్టమైన అడవి, పచ్చటి చెట్లతో ఉన్న ప్రాంతం. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటలు మధ్యలో బలమైన గాలులతో భారీవర్షం కురిసింది. దీంతో కూకటివేళ్లతో సహా చెట్లు కూలిపోయాయి. 3 కిలోమీటర్ల పొడవు, అర కిలోమీటరు వెడల్పులో మొత్తం 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భారీనష్టం వాటిల్లింది. 50 వేల చెట్లు కూలిపోయినట్లు శాంపిల్ సర్వేలో అంచనా వేశాం.
- చెట్లు కూలిపోయిన ప్రాంతమంతా రాళ్లు, రప్పల్లేని సారవంతమైన నేల. ఇక్కడి పెరిగిన చెట్ల వేర్లు భూమి లోపలికి కొద్దిమేరకే వెళ్లాయి. దీంతో ఉద్ధృతమైన గాలి, వానలకు ఈ చెట్లు తట్టుకోలేకపోయాయి. కొన్నిచెట్లు సైతం కొమ్మలు వరకు విరిగిపోయాయి. కూలిన చెట్లను వారం రోజుల్లో లెక్కించాలని కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. వాటిని సమీపంలోని డిపోనకు తీసుకెళ్లారు.
- ధ్వంసమైన ప్రాంతాలను సంరక్షిస్తే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించవచ్చు. అటవీ ప్రాంతం చుట్టూ కంచె వేయాలి. 204.30 హెక్టార్ల అటవీప్రాంతానికి ఆనుకునే మంచి అడవి ఉంది. వాటి నుంచి వచ్చే విత్తనాలు చెట్లు కూలిన ప్రాంతంలో అడవుల పునరుద్ధరణకు ఉపయోగపడతాయి అని తన నివేదికలో పీసీసీఎఫ్ వివరించారు.
కూలిన చెట్లు, ఎక్కడెక్కడ, ఎంత మేరకు ? | |||
రేంజ్ | సెక్షన్ | బీట్ | ప్రాంతం (హెక్టార్లలో) |
తాడ్వాయి | తాడ్వాయి | కమరం వెస్ట్ | 41.20 |
తాడ్వాయిసౌత్ | బోడిగూడ సౌత్ | 42.60 | |
మేడారం | మేడారం సౌత్ | 50.20 | |
పస్రా | పస్రా | మోట్లగూడ | 70.30 |