Cheetah At Miyapur Metro Station In Hyderabad : మీరు మియాపూర్లో ఉంటున్నారా అయితే మీ కోసమే ఈ న్యూస్. మీరు ఉంటున్న ఏరియాలో చిరుతపులి కనిపించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక వద్ద ఇవాళ కొందరు చిరుతపులిని చూశారు. స్టేషన్ వెనక జరుగుతున్న నిర్మాణాల కోసం వచ్చిన కూలీలు చిరుతను చూశారని సమాచారం.
చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు : చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను వీడియో తీసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులను సంప్రదించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుతపులిని గాలించే పనిలో ఉన్నారు. మరోవైపు మియాపూర్ మెట్రో వెనక ఉన్న చంద్రనాయక్ తండావాసులతో పాటు చుట్టూ పక్కల కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.
సాధారణంగా వికారాబాద్ సమీపంలో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనక వైపు గతంలో చిరుతలు సంచరించాయి. అప్పుడు అటవీ అధికారులు వాటిని బంధించి నల్లమల అడవుల్లో వదిలిపెట్టారు. ఇప్పుడు కొత్తగా మియాపూర్ వంటి జనావాసం ఉన్న ప్రాంతంలో కనిపించిందన్న సమాచారం స్థానికంగా కలకలం పుట్టిస్తోంది. వీలైనంత త్వరగా చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి : రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు నిత్యం జంతువులతో సావాసం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా పులులు సంచరించే ప్రదేశంలో మరింత భయంగా జీవితాన్ని సాగిస్తారు.పెద్దపులి జనావాసంలోకి వచ్చి రైతుపై దాడి చేయడంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
దీంతో పులులు సంచారిస్తున్న గ్రామాల్లో స్థానికులు ఒంటరిగా రాత్రివేళ తిరగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లే సమయాల్లో జాగ్రత్త పాటించాలన్నారు. ప్రధానంగా పశువుల కాపరులు ఒంటరిగా పశువులను మేపడానికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గుంపులుగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వామ్మో! తిరుమలలో మళ్లీ చిరుత - భయంతో పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది - Leopard Wanders At Tirumala