Chaotic Drainage Construction in Vijayawada: డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే మురుగునీరు, వర్షపు నీరు సాఫీగా ప్రవహిస్తుంది. ప్రధాన నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండకుంటే ప్రజలు అవస్థలు పడాల్సిందే. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపుల బెంజిసర్కిల్ నుంచి పెనమలూరు వరకు జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. కట్ల పాములు కూడా అన్ని మెలికలు తిరగవేమో అనిపిస్తున్నట్లు పనులు చేస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు, ఇతర నిర్మాణాలేవైనా అడ్డు వస్తే అక్కడ మలుపు తిప్పేసి పనులు చేపడుతున్నారు.
విజయవాడలో పడకేసిన పారిశుద్ధ్యం- మృత్యుపాశాలుగా మారుతున్న డ్రైనేజీలు
జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ నుంచి చేపడుతున్న డ్రైనేజీ కాలువలు వంకర్లు తిప్పుతూ కట్టుకుంటూ పోతున్నారు. విద్యుత్తు శాఖతో మాట్లాడి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి మరోచోట పెట్టించి డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నారు. ఇది అదనపు ఖర్చుగా భావించి వాటిని అలాగే వదిలేసి పనులు చేసుకుంటూ పోతున్నారు. విజయవాడ బెంజిసర్కిల్ నుంచి పోరంకి వరకూ 8 కిలోమీటర్ల వరకూ జరుగుతున్న ఈ కాలువల నిర్మాణ పనులను ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో పరిశీలించగా చిత్రవిచిత్రాలు వెలుగుచూశాయి.
విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారికి ఒకవైపున బెంజిసర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆటోనగర్, కామయ్యతోపు, తాడిగడప సెంటర్, పోరంకి వరకు పరిశీలించగా సుమారు 25 ప్రాంతాల్లో మెలికలు తిప్పారు. రెండో వైపు కూడా పోరంకి నుంచి బెంజిసర్కిల్ వరకు 12 ప్రాంతాల్లో వంపులు తిప్పారు. డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేయడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు.
ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - ముందుకు సాగని పట్టణ, నగరాభివృద్ధి - Negligence on Urban Development
బందరు రోడ్డులోని అశోక్‌నగర్ ప్రాంతంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో దానిని అలాగే వదిలేసి, కాలువను రహదారి మీదుగా మలుపులు తిప్పేశారు. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ చోట ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో కాలువ వెడల్పును తగ్గించేసి నిర్మించారు. కాలువ మధ్యలోనే రెండు విద్యుత్ స్తంభాలున్నా వదిలేసి అలాగే ముందుకెళ్లిపోయారు. కామయ్యతోపు వద్ద స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో వాటిని అలాగే వదిలేసి రెండు వైపులా ఐదు అడుగుల విస్తీర్ణంలో కాలువ తవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఈ స్తంభానికి ఇరువైపులా కాలువ తవ్వేయడంతో అది ఎప్పుడైనా రహదారిపైకి కూలిపోవచ్చు. అయినా పట్టించుకోకుండా తవ్వుకుంటూ పోయారు. ఒక చోట దారిలో విద్యుత్తు స్తంభాన్ని కాలువ మధ్యలోనే ఉంచేసి నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్తంభం ఎప్పుడైనా తొలగించాలంటే కాలువను మళ్లీ తవ్వాల్సిందే. ఈ విధంగా నిర్మాణం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.