Chandrababu took Charge as Chief Minister in AP : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మొదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.
నిరుద్యోగ యువతకు వరంగా డీఎస్సీ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు చూస్తే ఎస్జీటీ 6,371 పోస్టులు కాగా, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులను విడుదల చేశారు.
రాకాసి చట్టానికి చెల్లుచీటీ : ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైఎస్సాఆర్సీపీ పెద్దలు పావులు కదిపారు. అయితే, తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫొటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు.
పింఛను రూ.4 వేలకు పెంపు : 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛన్‌ను 5 రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్‌ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛన్ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్ రూ.4 వేలు, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను రూ.1,000 చొప్పున పెరిగిన మొత్తం రూ.3 వేలు కలిపి రూ.7 వేల పింఛన్‌ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు రూ.4 వేలు పింఛన్ అందనుంది.
పేదలకు అండగా అన్నక్యాంటీన్ల పునరాగమనం : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని రూ.5లకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు రూ.31 కోట్లు ఖర్చు చేసింది. పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కేవలం తెలుగుదేశం ప్రారంభించిందన్న కక్షతో జగన్ మూసివేయించారు. అయినా టీడీపీ నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు.
నైపుణ్య గణనపై ఐదో సంతకం : యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు ఐదో సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ఏ రంగానికి ప్రాధాన్యముంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది.