Chandrababu Naidu Letter to Governor Justice Abdul Nazeer : సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిముషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లబ్దిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఆయన లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ప్రకటనకు కొద్దిరోజుల క్రితం ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.
టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
ఎన్నికల కోడ్‌కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిందని, అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని లేఖలో ప్రస్తావించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని విమర్శించారు. ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.
రుణాలు కింద తెచ్చిన 4 వేల కోట్లు, బాండ్ల ద్వారా 7000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందని, ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లబ్దిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా చంద్రబాబు జత చేశారు.