AP CM Chandrababu Oath Ceremony at Assembly : ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవసభలోనే అడుగుపెడతానని 2021 నవంబర్ 19న శపథం చేసిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నేడు తొలిసారిగా అసెంబ్లీకి వచ్చారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందు ఉదయం అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
నాటి శపథం నిలబెట్టుకుంటూ: "ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నా" ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు శాసనసభను బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎవరినీ అవమానించేలా మాట్లాడలేదని ఆనాడు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని అన్నారు. ఎవ్వరి పట్లా అమర్యాదగా ప్రవర్తించలేదని, కానీ తన భార్య గురించి అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ నాడు శపథం చేశారు. ఎనిమిదిసార్లు ఎన్నికైన తన అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్ల తర్వాత నేడు చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా 'సీఎంగా అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతా'నంటూ నాడు చంద్రబాబు చేసిన శపథాన్ని టీడీపీ శ్రేణులు మరోసారి గుర్తు చేసుకున్నారు.
రెండు కళ్లూ పొడిచేశారు! - విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - SYMBOL OF DESTRUCTION IN AP