Chandrababu Held Teleconference With TDP Leaders: ఓటమికి కారణాలు వెతుకుతున్న వైఎస్సార్సీపీ నేతలు ఈసీ, పోలీసులు తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాక పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నేతలకు ఆదేశించారు. 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు.
కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు రేపు సాయంత్రం అమరావతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి చంద్రబాబు- పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.