Chandrababu Fire on CM Jagan in Janda Public Meeting : వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన 'తెలుగు జన విజయకేతనం జెండా' ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. తెలుగోడి రోషం ఎంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం : రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్ వద్ద స్కెచ్ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూప్రింట్ ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని, 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామని తెలిపారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కావున వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైఎస్సార్సీపీ దొంగలపై టీడీపీ-జనసేన పోరాడలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: బాలకృష్ణ
ఫ్యాన్ ముక్కలై పోవాలి : రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇదని చంద్రబాబు అన్నారు. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు - ఎవరు తక్కువ కాదని, రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాయని తెలిపారు. టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలని పేర్కొన్నారు. పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలని, ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్ స్పష్టం చేశారు.
సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి : పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లామని, కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చిందని, సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్ మీడియాలో వేధించారని అన్నారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనమని, అందుకే, వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలలని పిలుపునిచ్చారు.
సభా వేదికపై చంద్రబాబు, పవన్ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం
టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ - వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్ : జగన్ 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ సినిమా నాటకాలు చేశారని, ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని స్పష్టం చేశారు. జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా అని, అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? టీడీపీ-జనసేన కూటమి సూపర్‌హిట్ సినిమా అని అన్నారు. జగన్ పార్టీ గూండాలకు తమ సినిమా చూపిస్తామని అన్నారు. టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్ అని అన్నారు.
తాడేపల్లి గూడెం సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది : నవోదయంకి నాంది పలికే శుభ పరిణామం ఇది అని స్పష్టం చేశారు. సైకో విముక్త ఆంధ్రప్రదేశ్‌కు అంతా సిద్ధం కావాలన్నారు. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్-1 గా నిలిపేందుకు తాను పవన్ కల్యాణ్ సిద్ధం, ప్రజలంతా ఇందుకు సంసిద్ధం కావాలని సూచించారు. రాష్ట్రం దశ దిశ మార్చే సభ ఇది అని పేర్కొన్నారు. తాడేపల్లి గూడెం సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుందని ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సైకో పాలన లేదని, జగన్ ఏం పొడిచాడని అతనికి ఓటయ్యాలని ప్రశ్నించారు. వైనాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ ఉచిత ఇసుక, వైనాట్ మెగా డీఎస్సీ కి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఈరోజు చరిత్ర తిరగ రాసే రోజు ఈరోజు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం పోరాడాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఉన్నారు. దొంగలపైన పోరాడుతున్నాం. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకులని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.'-చంద్రబాబు, టీడీపీ అధినేత