Chandra Babu Naidu About TDP 42nd Foundation Day: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, టీడీపీ నేతలు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడం అని దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన ఎన్టీఆర్ నేర్పారని చంద్రబాబు కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో టీడీపీ నిమగ్నమై ఉందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా టీడీపీ ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
TDP @ 40 Years: పలు దేశాల్లో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు
Nara Bhuvaneshwari:ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యాక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భువనేశ్వరి కేక్ కట్ చేశారు.
Nara Lokesh: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని లోకేష్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాల వారికి అండగా పసుపు జెండా నిలిచిందని లోకేష్ పేర్కొన్నారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తామని లోకేష్ కొనియాడారు.
చిత్తూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు
శ్రీకాకుళంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 42వఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గౌతు శివాజీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేశారు. జిల్లాలో నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
NTR District: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, కంభంపాటి రామ్మోహన్, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు
Celebrations in Party Office: కర్నూలు సమీపంలోని మామిదాలపాడు గ్రామంలో టీడీపీ నేత రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్థులకు మిఠాయిలు పంచారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కడప ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ జెండాను ఎగురవేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సీనియర్ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కొబ్బరికాయలు కొట్టారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎం కొండయ్య ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.