Central Team Visit to Flood Affected Areas : కృష్ణ జిల్లాలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రానున్నదని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. బుధవారం జిల్లాలో గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, నందివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆయా మండలాల్లోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
Central Team Tour in Krishna District : బుధవారం కేంద్ర బృందం జిల్లాకు విచ్చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగానికి అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని, ముంపుకు గురయ్యి గృహాలు సైతం దెబ్బతిన్నాయని, జరిగిన ఈ నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించేందుకు తాత్కాలిక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
తొలుత కలెక్టర్ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ముస్తాబాద్ రహదారి పరిశీలించారు. దెబ్బతిన్న ఆ రహదారికి మరమ్మతులు చేపట్టేందుకు 10 లక్షలతో అంచనాలు తయారు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం గన్నవరం జాతీయ రహదారి వంతెన వద్ద బుడమేరు నది ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వాస్తవాలను తెలియజేసేలా ఛాయచిత్రాలు, వీడియోలు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెనమలూరు మండలంలో ముంపు ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఇళ్లను కేంద్ర బృందానికి చూపించేందుకు జిల్లా కలెక్టర్ శాసన సభ్యులు బోడే ప్రసాద్‌తో కలసి పెదపులిపాక, ఎన్టీఆర్ నగర్లో పర్యటించారు. వరద ముంపు పరిస్థితులపై స్థానికులతో కలెక్టర్ మాట్లాడారు. రేషన్ కార్డులు లేకపోవడంతో తమకు నిత్యావసరాలు అందలేదని స్థానికులు కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆధార్ కార్డు సహాయంతో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వరద భయం నుంచి తేరుకుంటున్న విజయవాడ - Vijayawada Recover From Flood
అలాగే చోడవరంలో దెబ్బతిన్న పసుపు, అరటి, కంద, వరి, బొప్పాయి పంటలను పరిశీలించారు. పసుపు, కందకు లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టామని, అధిక నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కానీ పంట నష్టపోయినపుడు ఏ సీజన్లో కూడా కంద పంటకు నష్ట పరిహారం అందలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అందరికీ తగిన విధంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో 64 గ్రామాలపై బుడమేరు వరదల ప్రభావం పడిందని, 50 వేల హెక్టారుల్లో పంటలు ముంపులో ఉన్నాయన్నారు. పంట నష్టం వివరాలు, ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ బాలాజీ అన్నారు.
గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జొన్నపాడు నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో నందివాడ, తుమ్మలపల్లి గ్రామాలలోని వరద ముంపు పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. రొయ్యలు, చేపల చెరువుల తవ్వకాల వల్ల డ్రైనేజీ సరిగా లేక గ్రామాలు ముంపుకు గురయ్యాయని, దోసపాడు చానల్ గుర్రపు డెక్క, తూడుతో పూడుకుపోయి నీరు పారే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్తులు కలెక్టర్‌కి వివరించారు.