Central Teams Visited Huzurnagar Flood Affected Areas : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటిస్తున్నాయి.
నేడు హుజూర్నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి పంట పొలాలను, తెగిపోయిన కాలువలను, చెరువు కట్టలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హుజూర్నగర్ వరద నష్టం వివరాలు : హుజూర్నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో నల్లకట్ట చెరువు వద్ద వ్యవసాయ శాఖ అధికారులు వరద నష్టంపై ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు కేంద్ర కమిటీ బృందానికి ఫొటో ప్రదర్శన ద్వారా వరద నష్టాన్ని వివరించారు. అనంతరం కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంట నష్టంపై రైతులు తమకు జరిగిన నష్టాన్ని బృంద సభ్యులకు వివరించారు.
ఆదుకోవాలని కోరిన రైతులు : కళ్లెదుటే తమ కష్టం కొట్టుకుపోయిందని వరద బాధితులు కేంద్ర బృందానికి మొరపెట్టుకున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే వర్షాల వల్ల పంటలు కొట్టుకపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర కమిటీ బృందానికి విన్నవించుకున్నారు. మరోవైపు కూలిపోయిన ఇండ్లు, రహదారులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం : వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి వచ్చింది. ముందుగా సచివాలయంలో ఏర్పాటు చేసిన వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించగా, ఆ తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులు, సీఎస్‌తో సమావేశమయ్యారు.ఆ కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో పాటు మిగిలిన శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణకు వరదల వల్ల రూ.9 వేల కోట్లపైనే నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో రాష్ట్రానికి ఉదారంగా సాయం చేయాలని విన్నవించింది.
వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - విపత్తు నష్టంపై ఆరా - Central Team Visit telangana