Central Minister Bandi Sanjay on Hydra : కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం హై డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మొదట హైడ్రాకు మద్దతు ఇచ్చానని, పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్‌లను కూల్చితే సమర్ధించానన్నారు. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్‌తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతోంది. మొదట నేను కూడా హైడ్రాకు మద్దతు ఇచ్చా. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను కూల్చితే సమర్థించా. కానీ పేదలు వ్యాపారం చేసుకునే షాపులను, వారి ఇళ్లను కూల్చుతున్నారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు'- బండిసంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
MP Raghunandan rao Demanded to Extend Hydra in All Districts : మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలకు భిన్నంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హైడ్రాను కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తరించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధి చెల్లాపూర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులతో అంతర్గత రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా పని తీరుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాలకు కొన్నిచోట్లకే పరిమితం అయితే హైడ్రాపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.
హైడ్రా నిష్పక్షపాతంగా పని చేయాలి : బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలని పునరుద్ఘాటించారు. కోకాపేటలో నిరుపేద బాధితులకు 200 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రా పనితీరు నిష్పక్షపాతంగా ఉండాలని రంగనాథ్‌కు సూచించారు. లేదంటే కమిషనర్ ఉద్యోగం వదిలి పోలీసు నౌకరి చేసుకోవాలని హితవు పలికారు. చెరువు, కుంటల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ కింద నిర్మాణాలు తొలగిస్తే ప్రజల మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
'చెరువులో కట్టిన ఇళ్లను కూల్చివేయకపోతే హైడ్రా పనితీరుపై, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తాయి. నేను స్పష్టంగా చెబుతున్నా. నీళ్లల్లో పూర్తయిన ఇళ్లు పదేళ్ల నుంచి ఉంటున్నాయి. అవి కూల్చాల్సిందే, నూటికి నూరు శాతం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు కూడా క్లియర్ చేయాల్సిందే. హైడ్రాను హైదరాబాద్‌కే కాకుండా అన్నీ జిల్లాలకు విస్తరించాలని ప్రజలు, ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు. అవి విధంగా బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలి'- రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ