Central Govt Approves TS to TG Vehicle Registration : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణాశాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వివరించింది.
సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించిందని దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దాన్ని అనుసరించి కేంద్రం మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.
TG Vehicle Registration 2024 : మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే రిజిస్టర్ అయిన పాత వాహనాల పరిస్థితి ఏంటని వాహనదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం నవంబర్ 30 నాటికి రవాణా శాఖలో తెలంగాణవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 1,60,81,666 ఉన్నాయి. అయితే ఇప్పుడు పాత వాహనాలకు కూడా టీఎస్‌ను తొలగించి టీజీ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆర్థికంగా భారం పడుతుందని వారు వాపోతున్నారు.
TG Name Plate For Vehicle Registration : అలా కాకుండా తప్పనిసరిగ్గా మార్చాలంటే రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లు ఉండే అవకాశం ఉంటుందని అదొక సమస్యగా మారుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పాత వాహనాలను టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో తమపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీ పేరిట రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు (Vehicle Registration) తెలంగాణలో భారీ సంఖ్యలో ఉన్నాయి. చాలా మంది ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన వాహనాలను ఆంధ్రప్రదేశ్ పేరుతోనే తిప్పుతున్నారు. ఆ తర్వాత టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర రహదారి రవాణాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌తో టీజీ పేరిట రిజిస్ట్రేషన్ కానున్నాయి.
మరోవైపు పాత వాహనాలు దాదాపుగా టీఎస్ పేరు మీదనే కొనసాగుతాయని ఈ విషయంలో వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ (Telangana Transport Department) అధికారులు భరోసా ఇస్తున్నారు. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ కాబోయే వాహనాలకు మాత్రమే టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
మీకు గూడ్స్ వెహికిల్ ఉందా? అయితే వెంటనే ట్యాక్స్ కట్టేయండి - పట్టుబడ్డారో పెనాల్టీ మోతే!