Consumers Can Lodge A Complaint Through WhatsApp : గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులు అమ్మినా, ఎన్నిసార్లు చెప్పినా సరైన సర్వీస్ చేయకుండా ఇబ్బంది పెడితే ఇక నుంచి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాల నుంచి ఫిర్యాదుల దాకా అంతా ఆన్లైన్లోనే చేసుకునే వెసులు బాటుంది. మారుతున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్ చాట్‌బాట్’ సేవలను తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
చట్ట సవరణలు బట్టి మార్పులు : వినియోగదారులు మోసపోకుండా వారికి అండగా ఉండేందుకు కేంద్రం 1986 లో వినియోగదారుల రక్షణ చట్టం తీసుకొచ్చింది. దీనికి 2019లో కొన్ని సవరణలు చేసి మరింత రక్షణలు కల్పించారు. తాజాగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు మరింత సేవ చేసేందుకు, నాణ్యమైన వస్తు సేవలు పొందేందుకు వీలుగా కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఇక నుంచి మనం ఏదైనా వస్తువు కొన్నా, సరైన రీతిలో సర్వీస్ చేయకపోయినా ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఇందుకోసం ‘వాట్సప్ చాట్‌బాట్’ సేవలను తీసుకొచ్చింది. వాట్సాప్ నంబర్ 8800001915లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యేవరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. అయితే ఇందులో ఫిర్యాదు చేయవచ్చు కానీ కేసు నమోదుకు మాత్రం కమిషన్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసా? మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ఫోన్ నుంచి కూడా ఫిర్యాదు చేయొచ్చు : వినియోగదారులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు మాత్రమే కాదు టోల్ ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 నంబర్‌కు ఫోన్ చేసి సైతం ఫిర్యాదు చేయొచ్చు. రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in వెబ్‌సైట్‌లో ‘nch success stories’ పేరుతో పొందుపరుస్తోంది. మనం నమోదు చేసిన కేసు వివరాలు, దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో స్టేటస్‌ను ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
వినియోగదారులకు చిన్న చిన్న సమస్యలు వచ్చినపుడు స్థానిక ఫోరమ్ సివిల్ కోర్టులకు పోయే బదులు హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కారం పొందేందుకు దీనిని ఏర్పాటు చేశారని సంబంధిత అధికారులు అన్నారు. ముందుగా బాధితులు చేసిన ఫిర్యాదు కాపీని ప్రతివాదులకు పంపిస్తారు. పరిష్కరించమని చెబుతారు. అయితే ఈ హెల్ప్‌లైన్‌కు ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అధికారం లేదు. వినియోగదారులకు 24 గంటలు సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్‌ను తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
ఏదైనా వస్తువు డబ్బులు పెట్టి కొంటే ఏదైనా లోపం ఉంటే నష్టపోతే బాధితులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు, అక్రమ వ్యాపారాలు చేసినప్పుడు కూడా కేసు వేసుకోవచ్చు. 2019లో వచ్చిన నూతన చట్టం ద్వారా ఈ సర్వీస్ ద్వారా జరిగిన నష్టాలకు కూడా పరిహారం పొందవచ్చు. సెలబ్రిటీలు చేసే ప్రకటనలు తప్పుదారి పట్టిస్తే కూడా ఫిర్యాదు చేయవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వరంగా సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతున్నారు.
పిల్లల స్నాక్స్ విభాగంలో ఎలుక - డీమార్ట్‌లో కలకలం - Rat Died in Ramachandrapuram DMart