Cell Phone Theft Masood Gang Arrested : నగరంలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన సెల్‌ఫోన్ చోరీ ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న అర్థరాత్రి చోరీలతో భయానక వాతావరణాన్ని సృష్టించిన మసూద్ ఉర్ రెహమాన్, ఫజల్ ఉర్ రెహమాన్ అనే ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసూద్‌పై గతంలో నాచారంలో ఒకటి, మైలార్‌దేవ్‌పల్లిలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మసూద్ విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే తరహా కేసుల్లో గతంలో అరెస్ట్ అయినట్లు తెలిపారు. ఈనెల 19న బంధువుల ఇంటికి వచ్చిన మసూద్ స్నేహితుడైన ఫజల్‌కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి 19న అర్ధరాత్రి ఛాదర్‌ఘాట్ వైపు వెళ్లిన నిందితులు అక్కడ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. దాన్ని మలక్‌పేటలోని స్వాగత్ హోటల్ వద్ద పార్క్ చేసి రాత్రి గం2.30 సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లారు.
గణేశ్ ఆలయం సమీపంలో స్టేషన్ వైపు వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ చోరీచేసేందుకు ప్రయత్నించగా, అతను అడ్డుకున్నాడు. వెంటనే తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లారు. వారు తప్పించుకుని వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న వారికి కత్తులు చూపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఘటనాస్థలంలో బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్ టీమ్ నిందితులను వెంబడించింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితులను వెంబడించారు. ఇదే క్రమంలో మరో చోరీ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బులెట్ నిందితుడు మసూద్ కాలిలో దిగింది. అయినా పారిపోయేందుకు ప్రయత్నించగా మరో కాల్పులు జరిపినా ఉపయోగం లేకపోయింది. దీంతో పరారైన నిందితుల కోసం గాలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి 48 గంటల్లో పట్టుకున్నారు.