CBI Counter in Telangana High Court About MP Avinash Reddy Bail Cancellation: ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా దస్తగిరి పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు షరతులు ఉల్లంఘించినందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తన కుటుంబసభ్యులను వేధిస్తున్నారని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు రూ.20 కోట్లు ఆశచూపి ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
CBI on MP Avinash Reddy: అయితే దీనిపై దస్తగిరి వాదనను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని సీబీఐని హైకోర్టు అడిగింది. దస్తగిరి వాదనను తాము సమర్థిస్తున్నామని సీబీఐ తెలిపింది. బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. తమ కన్నా ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆ పిటిషన్ విచారణలోనే తమ వాదన వినిపిస్తామన్న సీబీఐ తెలిపింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని అవినాష్ రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులని సీబీఐ తెలిపింది. నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారని అన్నారు. వివేకా హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్ దస్తగిరి అని అయితే ఇప్పుడు తనతో పాటు కుటుంబసభ్యులనూ బెదిరిస్తున్నట్లు దస్తగిరి చెప్పారని సీబీఐ కోర్టుకు వివరించింది. దస్తగిరి, సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలి సూచించింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ కోరగా ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది.
Viveka Murder Case Approver Dastagiri Petition: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి, వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను భయపెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించాలని సాక్షులను ప్రలోభ పెడుతున్నారని దస్తగిరి తరఫున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అలానే సీబీఐ కోర్టులోనూ తనకు రక్షణ కల్పించాలంటూ దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు.