Case File on CID Sunil Kumar : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై కేసు నమోదైంది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కుమార్ గతంలో సీఐడీ డీజీగా పని చేశారు. గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ డీజీ సునీల్ కుమార్‌తోపాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు : తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు.