Call Money Harassment in Tadepalligudem : ప్రజల అవసరాలే వారి అడ్డగోలు ఆదాయం. వేల రూపాయల్లో అప్పులు ఇస్తారు. చక్ర, బారు వడ్డీలు వేసి రెట్టింపు వసూళ్లు చేస్తారు. అప్పు చెల్లించకుంటే వేధింపులకు సైతం పాల్పడుతుంటారు. అక్కడితో ఆగకుండా తీసుకున్నదానికి మూడింతలు వేసి కోర్టు నోటీసులు పంపిస్తారు. అడిగే వారే లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్‌మనీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వేధింపులు తట్టుకోలేక ఊరు వదిలి వెళ్లిపోయినవారు కొందరైతే, ఆస్తిపాస్తులు అమ్ముకుని కుటుంబ సమేతంగా రోడ్డున పడిన వారు మరికొందరు.
ఇరవై రోజులకు రూ.10 వేల వడ్డీ : రోజూ వారీ వడ్డీలు సాధారణంగా నెల వడ్డీకి అప్పు ఇస్తుంటారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం పట్టణంలో మాత్రం రోజు వడ్డీకి కాల్‌కేయులు అప్పులు ఇస్తున్నారు. చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దందాలకు పాల్పడుతున్నారు. ఓ యువకుడికి అత్యవసరం రావడంతో పట్టణానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి నుంచి 50 వేల రూపాయలను వారం రోజుల్లో ఇస్తానని అప్పుగా తీసుకున్నారు. చెప్పిన సమయానికి కాకుండా ఇరవై రోజుల అనంతరం డబ్బులు తీసుకుని వెళ్లారు. తీసుకున్నదానికి రూ.10 వేల వడ్డీ ఇవ్వాలని చెప్పడంతో యువకుడు ఆశ్చర్యపోయాడు. గత్యంతరం లేక అడిగినంత డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు పరిసర ప్రాంతాల్లో కాల్‌మనీ కేటుగాళ్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. కుటుంబ అవసరాలు, వైద్యం, విద్య, వ్యాపారం తదితర అవసరాలకు అప్పులు ఇచ్చి, అడ్డగోలుగా ఎక్కువ వడ్డీలు వసూళ్లు చేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ, చెక్కుల మీద అప్పులు తీసుకున్నవారి పరిస్థితి మరింత దయనీంగా మారింది. నిర్ణీత సమయంలో డబ్బులు ఇవ్వకపోతే తీసుకున్న అప్పుకుఅయిదారు రెట్లు నగదు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నారు. దీంతో ఎవ్వరికి చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురవుతున్నావారెందరో ఉన్నారు.
అత్తిలికి చెందిన ఓ వ్యాపారి వ్యాపార అవసరాల నిమిత్తం పలువురి వడ్డీ వ్యాపారస్తుల వద్ద 20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. రెండు సంవత్సరాలకే అప్పు మొత్తం రూ.40 లక్షలకు చేరుకుంది. సొంతింటిని అమ్మి అప్పులు తీర్చినా వడ్డీలకు కోసం వేధిస్తుండటంతో ఆయన ఊరి వదిలి వెళ్లిపోయారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అప్పులు బాధలు తట్టుకోలేక తాడేపల్లిగూడెంలోని ఓ లాడ్జీలో ఉరేసుకుని మృతి చెందారు. ఇదే తరహాలో మరో యువకుడు కారుపై తీసుకున్న రుణాన్ని చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఏలూరులో కాల్‌మనీ ఆగడాలు - మంగళవారం వచ్చిందంటే బాధితులకు వణుకు - Call Money Harassment in Eluru
అప్పు తీర్చేందుకు దొంగతనాలు : పెంటపాడు మండలానికి చెందిన దంపతులు ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మైక్రో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడంతో వేధింపులు అధికమయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక అప్పు తీర్చడం కోసం దొంగతనాలు చేయాలని అనుకున్నారు. కొన్ని రోజుల కిందట రాచర్ల - వల్లూరిపల్లి మార్గంలో ఒంటరి మహిళ మెడలో బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో స్థానిక ప్రజలు వారిని పట్టుకుని పెంటపాడు పోలీసులకు అప్పగించారు.
Sexual Harassment : బాయ్ ఫ్రెండ్ కోసం అప్పు చేస్తే... అదే అదనుగా..!