CAG Report On Barrages Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరంపై ఆడిట్ నివేదిక ఇచ్చిన కాగ్ అందులో ఇతర బ్యారేజీల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ క్రమంలోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల దిగువ భాగంలో కొంత మేర 2019 నవంబర్‌లోనే దెబ్బతిన్నట్లు తెలిపింది.
2019 నవంబర్‌లో వరద భారీగా రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని వెల్లడించింది. గేట్లు మూసిన తర్వాత ఆనకట్టల దిగువ భాగంలో ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడల్లో కొంత భాగం, దిగువ భాగంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని పేర్కొంది. ఫలితంగా 180.39 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక (CAG Report On Kaleshwaram Barrages) వివరించింది.
Annaram Sundilla Barrages Damage : మేడిగడ్డ వద్ద 83.83కోట్లు, అన్నారం వద్ద 65.32కోట్లు, సుందిళ్ల వద్ద రూ.31.24కోట్లు నష్టం జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. విడుదలైన నీటి అధిక వేగం, శక్తిని వెదజల్లే పనులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ నష్టానికి కారణమని నీటిపారుదలశాఖ అధ్యాయనాలు వెల్లడించినట్లు తెలిపింది. ఈ అనుభవంతో మూడు బ్యారేజీల్లో నష్టాలను సరిదిద్దేందుకు రూ.476.03 కోట్లతో నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించిందని వెల్లడించింది. ఇందులో మేడిగడ్డకు రూ.212.03 కోట్లు అన్నారం బ్యారేజీకి రూ.139.50 కోట్లు, సుందిళ్లకు 124.50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు వివరించింది.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక
మేడిగడ్డలో సీపీ దిమ్మెల అప్రాన్ లాంచింగ్‌ల రూపకల్పన లోపభూయిష్టంగా ఉండడం వల్లే ఈ నష్టం జరిగినట్లు కాగ్ తెలిపింది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage Damage Issue) పిల్లర్లు కుంగడానికి గల కారణాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఇచ్చిన నివేదికలోనూ ఈ అంశాలు ఉన్నాయని చెప్పిన కాగ్, నివేదికలో కమిటీ అభిప్రాయాలను పొందుపరిచింది.
ఆమోదించిన డ్రాయింగ్‌ల ప్రకారం, నీటి పారుదల శాఖ పర్యవేక్షణ, నాణ్యత ధ్రువీకరణలో కచ్చితంగా పనులు జరిగాయని మేడిగడ్డ బ్యారేజీ గుత్తేదారు తెలిపినట్లు రికార్డులు చెబుతున్నాయని కాగ్ పేర్కొంది. స్థానభ్రంశం చెందిన అప్రాన్‌లను పునరుద్దరించేందుకు గుత్తేదారు అంగీకరించినట్లు ప్రభుత్వం ఎటువంటి పత్రాలు ఇవ్వలేదన్న కాగ్, మేడిగడ్డ ఆనకట్ట అంచనా వ్యయం రూ.1849 కోట్ల నుంచి రూ.4321 కోట్లకు 134 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. అన్నారం ఆనకట్ట అంచనా విలువ రూ.1452 కోట్ల నుంచి రూ.2565 కోట్లకు 77 శాతం మేర పెరిగినట్లు చెప్పింది. సుందిళ్ల ఆనకట్ట అంచనా వ్యయం రూ.1248 కోట్ల నుంచి రూ.2148 కోట్లకు 72 శాతం మేర పెరిగినట్లు వివరించింది.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారు : ఉత్తమ్ కుమార్