Cable Operators Connect Expo AP 2024 in Vijayawada : నాణ్యమైన వస్తువులు, నమ్మకమైన సేవలు, ప్రత్యేక తగ్గింపు ధరలు సులభతరమైన వాయిదాల్లో చెల్లింపులు ఏదేని ఉపకరణం కొనాలనుకునే వారు కోరుకునేది ఇవే. పేరుగాంచిన సంస్థలన్నీ ఒకే చోటికి వచ్చి మరీ అధునాతన ఉపకరణాలను అరచేతికి అందిస్తుంటే అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. ఎవరైనా కొనకుండా ఉండరు. ఇంతటి మహదావకాశాన్ని కేబుల్ ఆపరేటర్లకు కల్పిస్తోంది విజయవాడలోని ఎక్స్ పో. తగ్గింపు ధరల్లో ఉపకరణాలు అందిచడమే కాదు, అవసరమైన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్నీ అందిస్తోంది. కేబుల్ ఆపరేటర్లకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోంది.
నష్టాల్లో చిక్కుకున్న కేబుల్ ఆపరేటర్లకు అండగా నిలుస్తోంది ఏపీ కనెక్ట్ ఎక్స్‌పో. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సిటీ నెట్‌వర్క్, వి డిజిటల్, పయనీర్, కంట్రోల్ ఎస్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు రెండో రోజు ఏపీ, తెలంగాణ నుంచి పెద్దఎత్తున కేబుల్ ఆపరేటర్లు తరలి రావడంతో స్టాళ్లు కిటకిటలాడాయి. కేబుల్ వ్యవస్థకు అవసరమైన కేబుళ్లు, అత్యాధునిక పరికరాలను ఎక్స్‌పో నిర్వాహకులు రాయితీపై అందించే ఏర్పాట్లు చేశారు.
ఇంటర్నెట్ ఉంటే చాలు. యాప్ ద్వారా అతి తక్కువ ధరలో ఎక్కువ ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పించడం ద్వారా వినియోగదారులకు, కేబుల్ ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చుతున్నట్లు స్మార్ట్ ప్లే టీవీ డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం పలు కేబుల్ టీవీ సంస్థలు ఛానళ్లతో పాటు, ఇంటర్నెట్ కలిపి ప్యాకేజీగా అందిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి అధునాతన సీసీ టీవీ వ్యవస్థలను అనుసంధానిస్తూ పలు సంస్థలు తమ ఉత్పత్తులను ఎక్స్ పోలో ప్రదర్శించాయి. ఏపీ ఫైబర్ నెట్ సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్ టెల్ స్టాళ్లను ఏర్పాటు చేసి తక్కవ ధరలో కేబుల్ ఆపరేటర్లకు పలు ఆఫర్లతో ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఎక్స్‌పో చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి లోకేశ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
"టెక్నాలజీ మొత్తం కూడా క్లబ్ చేసి కేబుల్ ఆపరేటర్కి అతి తక్కువ ధరకే ఇస్తున్నాం. జియో, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీల టెక్నాలజీకి ధీటుగా కేబుల్ ఆపరేటర్లు టెక్నాలజీగా స్మార్ట్ ఫ్లేని నిలబెడుతున్నందుకు మేం సంతోషిస్తున్నాం"_కిషోర్ కుమార్, ఎండీ, స్మార్ట్ ప్లే టీవీ