BTech Course Fees Finalized in AP Government : రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1.03 లక్షల రూపాయల నుంచి 1.05 లక్షలు రూపాయలు, అత్యల్పంగా 40 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించారు. ఇందులో 40 వేల రూపాయల రుసుము ఉన్న కళాశాలలు 114, లక్ష రూపాయలకు పైన రుసుము ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి.
Architecture Course Fees in AP : ఏపీ ఉన్నా రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35 వేల రూపాయల చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయని ప్రభుత్వం సృష్టం చేశారు. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ మొదలైన ఫీజులను ప్రభుత్వం ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలా చేసే వారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్ పేర్కొన్నారు.
గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ (RVR & JC), విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ (SRKR), శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ ఉమెన్ కళాశాలలకు 1.05 లక్షల రూపాయలు చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు 1.03 లక్షల రూపాయలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి 92,400 రూపాయలు, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఫీజు 93,700 రూపాయలుగా ఉంది.