KTR Slammed the Congress On Hydra Actions : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని, అందుకే పేదలు, మధ్యతరగతి వారిని టార్గెట్ చేసి బుల్డోజర్లు పంపుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని ప్రశ్నించిన కేటీఆర్, సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో కాదా అని అడిగారు. ఎన్ కన్వెన్షన్‌కు తమ హయాంలో నోటీసులిస్తే నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి టాక్స్ నడుస్తోందని, అది సెటిల్మెంట్ల అడ్డా అని అరికెపూడి గాంధీ తనకు చెప్పారని కేటీఆర్ తెలిపారు.
హైడ్రాకు చట్టం లేదు, చుట్టరికం మాత్రమే : రేవంత్ రెడ్డి చిట్టినాయుడు అయితే ఆయనకు ఏడుగురు సోదరులు అన్న కేటీఆర్, పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌లు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. హైడ్రాతో గూడు కోల్పోయిన పేదలకు 40వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రాకు చట్టం లేదని, చుట్టరికం మాత్రమే ఉందని కేటీఆర్ అన్నారు. అక్రమాలన్నీ తవ్వితే బయటకు వచ్చేది కాంగ్రెస్ నేతల కుంభకోణాలు, లంబకోణాలే అని పేర్కొన్నారు. పేదల ఇండ్లు కూలుస్తున్నారు కానీ వారికి అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ అడిగారు.
శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక రావడం ఖాయం : రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదన్న ఆయన, నల్గొండ బాంబా, ఖమ్మం బాంబా అన్న భయంతో తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో మాట్లాడుతున్నారని, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవరని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పిన దౌర్భాగ్యులు ఎవరని ప్రశ్నించారు. శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక రావడం ఖాయమని, పార్టీని మోసం చేసిన వారికి మనమంతా బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు.
"చాలా తొందరలో శేరిలింగంపల్లిలో ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ లెక్కపెట్టి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వాళ్లను మడతపెట్టి, ప్రజల్లో తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. ఏమి అన్యాయం చేసింది బీఆర్ఎస్, ఎందుకు పార్టీ ఫిరాయింపులకు దిగారన్న ప్రశ్నకు సమాధానం లేదు." -కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ వాళ్లేనని సీఎం ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందన్న కేటీఆర్, డైవర్షన్ పాలిటిక్స్‌తో ఎక్కువ కాలం రాజకీయాలు నడవవని అన్నారు. కేసీఆర్ విలువ ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, ఎక్కడ పోయి ఎవరిని కదిలించినా అయ్యో తప్పు చేసి కేసీఆర్‌ను ఓడగొట్టుకున్నామన్న వేదన వినిపిస్తోందని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో రోజూ ఎక్కడో ఒక శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఉండేదని, ఇప్పుడు 9 నెలలు దాటినా ఎక్కడా అభివృద్ధి ఊసేలేదని అన్నారు.
సీవీసీ స్వతంత్ర సంస్థ.. దానికి మీ సిఫార్సు దేనికి? : మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు ఉందని మండిపడ్డారు. అమృత్ టెండర్ల వ్యవహారంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నారన్న ఆయన, కేంద్ర పథకమైన అమృత్‌లో అవినీతి జరిగిందని మొదటగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్‌గా కళ్లు మూసుకున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. వ్యవహారం మొత్తాన్ని ఆధారాలతో బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికని ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థ అయిన కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు బండి సంజయ్ సిఫార్సు ఎందుకని అన్నారు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ అందరూ గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions
ఆ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : కేటీఆర్