KTR about Party Joinings in Telangana : ప్రస్తుతం రాష్ట్రంలోని బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆ పార్టీని వీడుతున్న వేళ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందని, తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంత ఆఫర్ చేస్తుందో అన్న ఆశ్చర్యం కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీరు ఎంత ధర నిర్ణయించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల మొత్తం ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ కంటే ఎక్కువగా ఉంటుందా అని కేటీఆర్ అడిగారు.
ఎమ్మెల్యేల చేరికలపై కేటీఆర్ ట్వీట్ : ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికల పర్వం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లోకి ఇప్పటి వరకు తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో కూడా మరో ఐదారుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. అప్పటికే దానం నాగేందర్‌తో సహా పలువురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను విన్నవించగా హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల తర్వాత చేరికల్లో జోరు పెరిగింది, దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ ఎమ్మెల్యేల చేరికలపై ఆసక్తికరంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery