BRS President KCR Comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే, తాము ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ శనివారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్, మళ్లీ గులాబీ దళమే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గులాబీ నేతలు ఎటువంటి హైరానా పడాల్సిన అవసరం లేదని తెలిపారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కూలగొడతామంటూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాలన్నారు. అంతే కానీ కూలగొడతామని పిచ్చిగా మాట్లాడితే ప్రజలు హర్షించరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు బాధ్యత ఇస్తే, అంతే బరువుతో సేవ చేయాలని, గతంలో తమ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
"ప్రతి జిల్లా, మండలం నుంచి 100 శాతం బీఆర్ఎస్ వస్తుందని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాలి. మనిషిని పైకి తేవాలి కానీ కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు ప్రభుత్వం మాట్లాడే మాటలేనా? మాకు అలాంటి మాటలు రావా?. ఇవాళ మొదలు పెడితే రేపటి వరకూ మాట్లాడుతూనే ఉంటాను. ఒక బాధ్యతను మీకు అప్పగిస్తే, దాన్ని తీసుకొని అంతే బరువుతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలకంటే 90 శాతం మేము ఎక్కువే చేశాం."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనను కలుస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై పార్టీ తరఫున ఇదే విధంగా వినిపించాలని, టైం చూసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలనే భావనతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత- భావోద్వేగానికి గురైన గులాబీ బాస్ - MLC KAVITHA MEET KCR