BRS Telangana Decade Celebrations 2024 : రాష్ట్ర పదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ తరపున ఊరూరా నిర్వహించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. జూన్ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగే వేడుకల్లో అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు.
Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ, మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనుంది. జూన్ రెండో తేదీతో రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతుంది. 2014 జూన్ రెండో తేదీ మొదలు ఇటీవలి ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పదో ఏట అడుగు పెట్టిన సందర్భంగా నిరుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు : ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు విపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలు, శ్రేణులను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వేడుకలు నిర్వహించి జూన్ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోని ఘట్టాలు, బీఆర్ఎస్ పాత్రను వివరించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు కేసీఆర్ పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కార్యక్రమాలపై నేడో, రేపో స్పష్టత రానుంది.