BRS MLC Kavitha Withdraws Default Bail Petition : దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ, డీఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని జులై 6న కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని వాదనల సందర్భంగా సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
ఈ మేరకు ఈ నెల 9న రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ జరపనుంది. చట్ట ప్రకారం తనకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున, డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉప సంహరించుకుంటున్నట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగాల్సి ఉండగా, వాదనలు వినిపించాల్సిన న్యాయవాదులు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కోరారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా
కవిత తరఫు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి, పిటిషన్‌పై తుది విచారణ బుధవారం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాదనలు వినిపించలేకపోతే పిటిషన్ ఉప సంహరించుకోవాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ఈరోజు ఉదయం డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉప సంహరించుకుంటున్నట్లు కవిత న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.
కవితతో కేటీఆర్ ములాఖత్ : ఇదిలా ఉండగా కేటీఆర్, హరీశ్‌రావు నేడు కవితతో ములాఖత్ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తిహాడ్ జైలులో ఉన్న కవితను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబంతో పాటు పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆమెకు భరోసా ఇచ్చారు.
తిహాడ్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత - ఆసుపత్రికి తరలింపు - MLC Kavitha Suffer From Fever