BRS MLAs And Leaders Protest At Cyberabad CP Office : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇదేం ప్రజాపాలన? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని హరీశ్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డికి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆయన్ని పరామర్శించారు. అరెకపూడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన పరిసరాలను పరిశీలించారు. పోలీసులే ఎస్కార్టు ఇచ్చి మరీ అరికెపూడిని తీసుకువచ్చారన్న హరీశ్‌రావు ఇదేనా ప్రజా పాలన అంటే అని దుయ్యబట్టారు. గాంధీని ఎందుకు హౌస్ అరెస్టు ఎందుకు చేయలేదని నిలదీశారు.
ఏసీపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ : కౌశిక్‌రెడ్డి ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీపీ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రమే సీపీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించగా సైబరాబాద్ జాయింట్ సీపీ డోయల్ డేవిస్‌కు వారు ఫిర్యాదు చేశారు. అరెకపూడి గాంధీ అనుచరులు రెచ్చిపోయి దాడి చేస్తుంటే నిలువరించలేని ఏసీపీ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేసే వరకూ కదలబోమంటూ సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Police Arrested BRS Leaders : సుమారు రెండు గంటలపాటు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా మిగతా నేతలను బలవంతంగా వ్యాన్ ఎక్కించి రెండు వాహనాల్లో వేర్వేరు మార్గాల్లో తరలించారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలను కేశంపేట వైపు, మరికొంత మంది నాయకుల్ని షాద్‌నగర్ వైపు తీసుకెళ్లారు.అరెస్ట్ సమయంలో తోపులాటలో హరీశ్‌రావు చేతికి గాయం తగిలింది.
పోలీస్ జీపును అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు : కొత్తపేట గ్రామం వద్ద హరీశ్‌రావు, ఇతర నేతలను తీసుకెళ్తున్న జీపును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై టైర్లు అడ్డుగా పెట్టి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు తలకొండపల్లి పీఎస్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు విడుదల చేశారు. తలకొండపల్లి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ బయలుదేరారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ కేటీఆర్ : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసుల అరికెపూడి గాంధీ, ఆయన అనుచరుల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్నందునే కౌశిక్‌రెడ్డిని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిందన్నారు.