BRS Leaders Protest At Gachibowli Police Station : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గురువారం హరీశ్‌రావుతో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. పార్టీ శ్రేణులతో కలిసి గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చిన ఎమ్మెల్సీ కవిత.. హరీశ్‌రావును విడుదల చేయాలంటూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కార్యకర్తల ఆందోళనతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ : బంజారాహిల్స్ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అరెస్ట్ చేశారు.
అంతకు ముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి హరీశ్‌రావును తరలిస్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఎక్స్‌వేదికగా కేటీఆర్ : దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుస్తున్న పేదవారి ఇండ్లకు అడ్డుపడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యవస్తలను వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారన్నారు. మా నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరు : రాష్ట్రంలో నేటితో ప్రజాస్వామ్యం మరణించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేశారని ఎక్స్ వేదికగా స్ఫందించన హరీశ్ రావు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమ్మర్జెన్సీనా అంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్‌కి గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. సీఎం పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరన్న హరీశ్ రావు.. తెలంగాణ సమాజమే మీకు బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు.
'స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గు చేటు' - BRS on CM Revanth Latest