MLA Padi Kaushik Reddy Allegations on Poonam : ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రెట్టింపు పరిమాణంతో ఫ్లైయాష్ తరలిస్తూ ఓవర్ లోడ్‌తో లారీలు వెళ్తున్నాయని, మంత్రికి రోజుకు రూ. 50 లక్షలు అందుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని, రవాణాశాఖ మంత్రి ఫోన్‌తో లారీలను అధికారులను వదిలిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.
తాను లారీలను ఆపుతున్నారన్న నేపథ్యంలో వాటిని వేరే మార్గంలో తీసుకెళ్తున్నారని, మంత్రి ఒత్తిళ్లకు అధికారులు లొంగవద్దని కౌశిక్ రెడ్డి సూచించారు. అధికారులు స్పందించకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని, మంత్రి పొన్నం నియోజకవర్గం హుస్నాబాద్‌లోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు లారీలను అడ్డుకుంటారని తెలిపారు. ఫ్లైయాష్ లారీ కారణంగా హుస్నాబాద్‌లో తన మిత్రుడు అఖిల్ చనిపోయారని, తన స్నేహితుడి మరణానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దీనిపై రవాణాశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌కు బాధ్యత లేదా అని నిలదీశారు. ఇలాగే కొనసాగితే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీపీసీ మొదలు అన్నిచోట్ల ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ స్కాంగ్రెస్‌గా మారింది : ఓవర్ లోడ్‌తో ఫ్లైయాష్ లారీలు వెళ్తుంటే ఎన్టీపీసీ, ఈడీకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి, ఎన్టీపీసీ అధికారులు స్పందించకపోతే దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలుస్తామని చెప్పారు. ఇలాగే కొనసాగి శాంతిభద్రతలు అదుపు తప్పితే బాధ్యులు రవాణాశాఖ మంత్రి, అధికారులే అవుతారని అన్నారు. నిబంధనల ప్రకారమే ఫ్లైయాష్ రవాణా జరగాలి తప్ప మంత్రి జేబులు నింపేందుకు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్కాంగ్రెస్‌గా మారిందన్న కౌశిక్, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్పందించడం లేదంటే ఇద్దరూ పంచుకుంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆర్పీ ట్యాక్స్‌గా అయిందని అన్నారు.
2019లో ఏపీలో తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమై ఇపుడు అధికారంలోకి వచ్చిందని, రేపు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాక తప్పదని కౌశిక్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించే వారు ఏపీ అధికారుల తరహాలో గులాబీ పార్టీ అధికారంలో వచ్చాక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తాము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామన్న ఆయన, అధికారులను బెదిరించడం లేదని, బాధ్యత గుర్తు చేస్తున్నట్లు చెప్పారు.
'ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోంది. నేను స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేశారు. మంత్రి పొన్నం ఫోన్‌తో మిగతా లారీలను వదిలిపెట్టారు' -పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే