Harish Rao Latest Tweet : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మార్పులపై మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనానికి వాస్తు దోషం ఉందని మార్పులు చేయడం సరికాదన్నారు. వాస్తు పేరుతో ఒక్క గేట్ మార్చేందుకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. సచివాలయంలో మార్పులపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
గ్రీన్ టెక్నాలజీ తో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికమైన కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చని.. గాయ్ గాయ్ గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి.ఇప్పుడు ముఖ్యమంత్రి గా సెక్రటేరియట్ కు పూటకో మార్పు చేస్తున్నాడు.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 7, 2024
వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు చేయటానికి 4 కోట్లు… pic.twitter.com/nHKRrbSdcM
గ్రీన్ టెక్నాలజీతో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలతో దేశానికే తలమానికమైన కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మించినట్లు పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని రేవంత్ రెడ్డి గత్తర గత్తర చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు చేయడానికి నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్కు "మార్పు" అని హరీష్ రావు ఎక్స్‌లో వ్యంగంగా ట్వీట్ చేశారు.
వాస్తు పేరుతో : సచివాలయ భవనాలు పాతబడ్డాయని, సౌకర్యవంతంగా లేవని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వాటిని పడగొట్టి 28 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవనం నిర్మించింది. దాదాపుగా దీని నిర్మాణం కోసం కొన్ని వందల కోట్లకు పైనే ఖర్చు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కేసీఆర్ దీనిని ప్రారంభించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటికే సచివాలయం ప్రధాన ద్వారం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా ఇక నుంచి ఈశాన్య గేటు ద్వారానే ప్రవేశించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేలా శంకుస్థాపన చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తనుంది. దాని కారణంగా ప్రధాన ద్వారాన్ని ప్రస్తుత స్థానం నుంచి తీసివేసి అదే తీరుగా ఈశాన్యం వైపున నిర్మించనున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్రూప్ 1 అభ్యర్థుల చలో సెక్రటేరియెట్‌లో ఉద్రిక్తత - మద్దతు పలికిన విపక్షాలు