BRS Leaders Reaction on State Budget 2024 : బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లే కేటాయించి అమలు చేస్తామంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీమంత్రి కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మిగతా 420 హామీలకు నిధులను కేటాయించలేదని మండిపడ్డారు. సనత్‌నగర్ నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
KTR Reaction On Telangana Budget 2024 : మేడిపండు లాంటి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, తెలంగాణలో ఇలాంటి నిరాశజనక బడ్జెట్‌ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పథకాల అమలు అంటే టీఎస్ తీసి టీజీ పెట్టడం, రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగింపు మార్పునకు శ్రీకారం చుట్టినట్లా అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ను బొందపెట్టడం కాంగ్రెస్‌తో కాదని, ఇలాంటి వాళ్లెందరినో చూశామని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) లాంటి బుడ్డర్ఖాన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ ప్రాజెక్టులను రాష్ట్ర హక్కులను కాపాడారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి కేఆర్ఎంబీ కింద ఉన్న ప్రాజెక్టులను అప్పగించారని మండిపడ్డారు.
త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్ క్యాలెండర్ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క
ఈనెల 13వ తేదీన నల్గొండలో జరిగే సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కృష్ణాజలాల్లో మనకు రావాల్సిన వాటాను కాపాడుకోవడానికి నడుం బిగించాలన్నారు. బీఆర్ఎస్ 39 ముక్కలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదని, సీఎం పదవి అంటే గుంపు మేస్త్రి అని చెప్పినట్లే ఆయన పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను కోల్పోయామనే బాధ ప్రజల్లో ఉందని, త్వరలోనే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు.
"మేడిపండు లాంటి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తెలంగాణలో ఇలాంటి నిరాశజనక బడ్జెట్‌ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలి". - కేటీఆర్, మాజీమంత్రి
Kavitha Reaction On Telangana Budget 2024-25 : బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్నికల ప్రచారంలో మైకుల ముందు చెప్పిన హామీల్లో, ఒక్కదానిపై కూడా చెప్పలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ ఛేంజర్ మాత్రమేనని, గేమ్ ఛేంజర్ కాదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, పథకాలకు పూర్తి కేటాయింపులు లేకపోయినప్పటికీ రానున్న ఐదేళ్ల ప్రణాళికకు సంబంధించి ఎక్కడా లేదని ఆక్షేపించారు.
" ఈ ప్రభుత్వం ఓన్లీ నేమ్ ఛేంజర్ మాత్రమే. గేమ్ ఛేంజర్ కాదు. గత ప్రభుత్వాలను విమర్శించడానికి సమావేశాలు పెట్టినట్లుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. మహిళా సంక్షేమం కోసం కేటాయింపుల్లో ప్రతిపాదనలు లేవు". - కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ