NIRANJAN REDDY ON PALAMURU PROJECT : రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు తొమ్మిది నెలలుగా నిలిచిపోయాయన్న నిరంజన్ రెడ్డి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు చేయడం లేదని, ప్రాజెక్టును పడావు పెడతారా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి చూడలేదని, నీటిపారుదల శాఖా మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆయన మండిపడ్డారు.
22 టీఎంసీలే ఒడిసిపట్టారు : ఈ ఏడాది జూరాలకు భారీగా నీరు చేరి అత్యధికంగా 3.88 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైందని పేర్కొన్నారు. 50 రోజుల్లో 732 టీఎంసీల నీరు వస్తే, ఇక్కడ ఒడిసిపట్టింది కేవలం 22 టీఎంసీలు మాత్రమేనని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ తర్వాత మిగతా నీరు అంతా సముద్రం పాలైందని అన్నారు. 3.50 లక్షల ఆయకట్టుకు కేవలం 3.90 టీఎంసీల ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను మాత్రమే నిర్మించారని అప్పటికే ఉన్న సింగోటం చెరువును దీనికోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అప్పట్లోనే జలాశయాలు నిర్మించి ఉంటే భారీ వరదలు వచ్చినప్పుడు నీళ్లు నింపే అవకాశం ఉండేదని అన్నారు.
కృష్ణాలో నీళ్లునా నింపే పరిస్థితి లేదు: సీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్ 8.51, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 15.34, ఉదండాపూర్ 16.03 టీఎంసీల సామర్ద్యంతో జలాశయాలు నిర్మించారని మాజీమంత్రి తెలిపారు. ఎన్నికలకు ముందే నార్లాపూర్ లో ఒక పంపును కూడా ప్రారంభించినట్లు నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. గత తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది వట్టెం, ఏదుల జలాశయాల వరకైనా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం పంప్ హౌస్ వరదలకు నీట మునిగిందని మండిపడ్డారు. వరుణుడి దయ వల్ల ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు నీట మునిగాయని కృష్ణాలో నీళ్లున్నా కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా జలాశయాలను నింపే పరిస్థితి లేదని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.