KCR Letters to CM Revanth : ప్రభుత్వం రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డికి 22 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ పాల్గొనట్లేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం బీఆర్ఎస్ను అడుగడుగునా అవమానించిందని, రేవంత్ ప్రభుత్వం వికృత పోకడలను నిరసిస్తూ వేడుకల్లో పాల్గొనడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాల లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర అవతరణ కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్నారని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. తనకు వేదికపై స్థానం కల్పించకుండా అవమానించారని, ప్రసంగించే అవకాశం కల్పించకుండా అవమానించారని తెలిపారు. ఇది కాంగ్రెస్ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్టనని, ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారని పేర్కొన్నారు. తనను అవమానించే మీ దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతును నెత్తిన పెట్టుకుని చూసుకుంటే, ఆరునెలల కాంగ్రెస్ పాలనలో రైతులను చెప్పుతో కొడతామంటూ అనడం దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచమే మెచ్చిన రైతబంధుపథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అన్నదాతలు పంట పెట్టుబడి కోసం చాచవలిసిన పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాము. సమర్థవంతంగా అమలుచేశాము.
ఆరు సంవత్సరాలలో 70 లక్షల మంది రైతులకు 73 వేల కోట్లు రూపాయలు పంట పెట్టుబడి సహాయం ఇచ్చాము. కరోనా సమయంలోను ఆపలేదు. కానీ నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమ్యారు. అలాగే రైతురుణమాఫీలోనూ తీవ్రంగా విఫలమయ్యారు. డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడంతో రైతులు వడ్డీవ్యాపారస్థులను ఆశ్రయిస్తున్నారు.
రైతు భరోసా కింద ఏటా రూ. 15000 పంట పెట్టుబడి సహాయం అందిస్తామని, వందరోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రకటించారు. గద్దెనెక్కినంక మాట తప్పి రైతుల ఆశలను అడియాసలు చేశారు. అన్ని పంటలకూ మద్ధతు ధర మీద రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీని మీరు నిలబెట్టుకోలేక పోవడం చూసిన రైతులు.. ఇంత దగనా, ఇంత మోసమా అని అశ్చర్యపోతున్నారు.
చావు కబురు సల్లగా చెప్పినట్లు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మారుస్తున్రు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 2500, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇకనైనా ఇటువంటి వైఖరీ మానుకొని ఎన్నికల వాగ్దానాలన్నీ తర్వలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.