BRS EX Minister Niranjan Reddy Fires On Congress : రాష్ట్రంలో రైతుల పరిస్థితులు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని, రైతుల జీవితాలతో రాజకీయాలు చేసి మోసం, దగా చేస్తున్న వారికి లోక్ సభ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసినందుకు బుద్ది వచ్చిందని ప్రజలు కంటతడి పెడుతున్నారన్న ఆయన, ప్రభుత్వాలు ప్రజల కష్టాల్ని అర్థం చేసుకోవాలి తప్ప, సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సబబు కాదని ఆక్షేపించారు.
BRS EX Minister Niranjan Reddy Comments : ప్రభుత్వం తప్పు లేదు ప్రకృతి తప్పు అంటున్న వారు రైతుల వద్దకు వెళ్లి ఎందుకు చెప్పడం లేదని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతాంగాన్ని ఎదుర్కొనే ధైర్యం, సత్తా ప్రభుత్వానికి లేదని, రైతులకు ఏమీ చేయలేదు కాబట్టి వారి వద్దకు పోలేకపోతున్నారని అన్నారు. రైతుల వద్దకు పోవడం లేదు కానీ, రోజూ ఇతర పార్టీల వారికి కండువాలు కప్పుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని రైతులు పోల్చుకుంటున్నారని, అదనంగా వస్తాయని అనుకున్నాం కానీ, ఇంత హోల్ సేల్‌గా మోసం పోతామని అనుకోలేదని రైతులు అంటున్నారని వ్యాఖ్యానించారు.
రైతులను ఎదుర్కొనే ధైర్యం, సత్తా ప్రభుత్వానికి లేదు. రైతులకు ఏమీ చేయలేదు కాబట్టి వారి వద్దకు పోలేకపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని రైతులు పోల్చుకుంటున్నారు. గత ప్రభుత్వం చేయనివి, మీరు చేసి మెప్పు పొందండి. పంట నష్ట పోయిన రైతులు అందరికీ పరిహారం ఇవ్వాల్సిందే. పాలన చేతగాక నిందలతో కాలం గడుపుతున్నారు. - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
అద్భుతమైన తెలంగాణ - 100 రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు : కేసీఆర్ - KCR Fires on Congress
Telangana Lok Sabha Elections 2024 : మంత్రి తుమ్మలను చూస్తుంటే జాలి వేస్తోందని, కాంగ్రెస్ పెద్దల కోసం తుమ్మల మాట్లాడటంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా రైతు అయిన తుమ్మలకు వాస్తవాలు తెలుసని, కేసీఆర్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న తుమ్మల ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆత్మవంచన చేసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. కేసీఆర్‌ను బదనాం చేయాలి, కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా చేయాలన్న దుర్బుద్ధి తప్ప ప్రభుత్వానికి ఇంకోటి లేదని ఆక్షేపించారు. ఒక్క ప్రాజెక్టు వద్దకైనా నీటి పారుదల, వ్యవసాయ శాఖల మంత్రులు వెళ్లి వచ్చారా అని అడిగిన నిరంజన్ రెడ్డి, రైతుల విషయంలో కేసీఆర్ నిబద్ధతను తుమ్మల, కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పుణ్యానే కదా తెలంగాణ రైతులు నష్టాల పాలైందని, రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తుమ్మల రుణమాఫీ అమలు చేయిస్తే, 500 బోనస్ ఇప్పిస్తే సంతోషిస్తామని తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎన్నో అన్నారని, మళ్లీ ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎప్పటికీ తమకు అమావాస్య కాదని, వారికి పౌర్ణమి ఎప్పటికీ కాదని అన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగానే మేడిగడ్డ ఆనకట్ట వద్ద రెండు, మూడు పిల్లర్లు దెబ్బతింటే దాన్ని రాద్దాంతం చేస్తున్నారన్న నిరంజన్ రెడ్డి నంది మేడారం వద్ద ఇవాళ చేస్తున్న ఎత్తిపోతలు రెండు నెలల కింద ఎందుకు చేయలేదని, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
పంట నష్ట పోయిన రైతులు అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పాలన చేతగాక నిందలతో కాలం గడుపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం కరవుకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని రైతాంగం ఉసురు పోసుకున్నది, పోసుకుంటున్నది ఎవరో అందరికీ తెలుసని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సేద్యానికి ఉసురు పోసింది ఎవరు ఊపిరి ఇచ్చింది ఎవరో రైతులను పోయి అడిగితే తెలుస్తుందని అన్నారు. రైతులు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేదంటే, ఇంత దగా చేసినా తమనే నమ్మారని కాంగ్రెస్ నేతలు చెబుతారని వ్యాఖ్యానించారు. మోసం చేసిన వారికి బుద్ది చెప్పి తమను తాము కాపాడుకోవాలని నిరంజన్ రెడ్డి రైతులు, ప్రజలను కోరారు.
వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : కేసీఆర్ - KCR FIRES ON CONGRESS GOVT