Brief History of Tirumala Laddu in Telugu : తిరుపతి దర్శనమంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారిని దైవంగా పూజించినట్లే ప్రసాదాన్ని భక్తులు ఎంతో అపురూపంగా భావిస్తారు. నెలరోజులైనా తిరుమల లడ్డూ రుచి, వాసన తగ్గేది కాదు. తిరుమల నుంచి ఇంటికొచ్చే వరకు లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జాగ్రత్త పడతారు. అనంతరం బంధుమిత్రులకు పంపిణీ చేస్తారు. తిరుమల వెళ్లి వచ్చాక ఎవరు కలిసినా లడ్డూ ప్రసాదం ఏదనే ప్రశ్నే వస్తుంది. మరి తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎప్పటినుంచి ప్రారంభించారో తెలుసుకుందాం పదండీ.
1940 నుంచి లడ్డూ : 15వ శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదం అంటే వడ. అప్పట్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు లేవు. వడ ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు భక్తులు. కాలక్రమంలో 19వ శతాబ్దంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి బూందీని లడ్డూగా చేసి ఇవ్వడం ప్రారంభం అయ్యింది.
తిరుమల శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్నా, లడ్డూలకు విశేష ఆదరణ ఉంది. స్వామివారి ప్రసాదం కోసం ఎందరో రాజులు, రాణులు ఎన్నో దానాలు చేశారు. 1803లో ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అనంతరకాలంలో లడ్డూగా రూపొందించారు.
భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ : ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న లడ్డూ ధర మొదట్లో రూపాయి ఉండగా క్రమంగా 25 రూపాయలు అయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.50 చేశారు. కల్యాణం లడ్డూను రూ.100 నుంచి రూ.200 చేశారు. దర్శనానికి వెళ్లిన భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ చేస్తుండగా అదనపు లడ్డూలు కావాలంటే కొనుక్కోవాలి.
స్వామి వారికి నైవేద్యం : శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ఉన్న 'పోటు'(వంటశాల)లో తయారు చేసిన ప్రసాదాలను ముందుగా వకుళమాతకు చూపించి, అనంతరం స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
- చిన్న లడ్డూ : 140- 170 గ్రాములు
- కల్యాణం లడ్డూ: 700 గ్రాములు
- రోజుకు తయారయ్యే కల్యాణం లడ్డూలు: 7100
- రోజుకు తయారయ్యే చిన్న లడ్డూలు: 3.5 లక్షలు
- రోజుకు తయారయ్యే మినీ లడ్డూలు(ఉచిత పంపిణీకి): 1,07,100
- రోజుకు తయారయ్యే వడలు: 4 వేలు
శ్రీవారికి నైవేద్యం : శ్రీనివాసునికి ఆగమశాస్త్రంలో నిర్దేశించినట్లు 50 రకాల ప్రసాదాలను నివేదిస్తున్నారు. స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్ల క్రితం శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం శ్రీవారికి నైవేద్యం ఇప్పటికీ సమర్పిస్తున్నారు. సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు ప్రసాద నివేదనలు జరుగుతాయి. రోజూ జరిగే నిత్యసేవల వివిధ రకాల నివేదన సమర్పిస్తారు.
- సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు.
- తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్లనువ్వులు, బెల్లం, శొంఠి నైవేద్యంగా సమర్పిస్తారు.
- సహస్రనామార్చన తర్వాత జరిగే మొదటిగంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని స్వామి వారికి నివేదిస్తారు.
- రోజు వారీ చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసాన్నం స్వామి వారికి సమర్పిస్తారు.
- మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం, లడ్డూ, దోసె, వడ, అప్పం నైవేద్యంగా పెడతారు.
- సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తర్వాత శుద్ధన్నం, సీరా నివేదన జరుగుతుంది.
- రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారు చేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం నివేదిస్తారు.
- రాత్రి ఆరాధన తర్వాత ఏకాంత సేవలో పాయసం నైవేద్యంగా పెడుతున్నారు.
విజయ, నందిని డెయిరీల నుంచి నుంచే నెయ్యి : గతంలో సహకార రంగంలోని విజయ, నందిని డెయిరీల నుంచి డబ్బాల రూపంలో నెయ్యి సరఫరా అయ్యేది. లక్ష వరకు లడ్డూలు తయారు చేస్తున్న రోజుల్లో డబ్బాలతోనే నెయ్యి సరఫరా కాగా, యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా లడ్డూల తయారీ పెంచారు. నెయ్యి వినియోగం భారీగా పెరగడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా మొదలు పెట్టారు.
శ్రీవారికి నివేదించే వివిధ రకాల ప్రసాదాలు : పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, కేసరిబాత్, మిరియాల అన్నం, కదంబం, కేసరి, లడ్డూ, వడ, జిలేబీ, పాయసం, అప్పం, పోలి, బెల్లపు దోశ, అమృతకలశం, నెయ్యి దోశ, దోశ, పానకం, వడపప్పు, ధనుర్మాసంలో ప్రత్యేక ప్రసాదాలు
తిరుమల కొండపై పూలు ధరించకూడదు - ఎందుకో తెలుసా? - NO FLOWERS RULE IN TIRUMALA