Boy Threatening Dogs Viral Video : రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రంలో ఏదో ఒక మూల కుక్క కాట్లకు బలైనవారు ఉంటూనే ఉన్నారు. గ్రామ సింహాల దెబ్బకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కనీసం బయటకు రావాలంటేనే ఏ క్షణం ఏ కుక్క వచ్చి దాడి చేస్తోందనే భయంలో గడుపుతున్నారు. వీటి దాడిలో చిన్నారుల నుంచి పెద్దవారి వరకు తీవ్ర గాయాలు, కొందరు ప్రాణాలు విడిచిన ఘటనలూ చాలానే చూశాం. ఇలాంటి ఓ భయానక ఘటన ఓ బుడ్డోడికి ఎదురైంది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళతారు అప్పుడే వారిని నాలుగు వీధి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కలను చూసిన భయంలో చిన్నారి పారిపోతుంది. కానీ అక్కడే బాలుడు నిలబడి ఉండిపోగా బుడ్డోడిపైకి శునకాలు వచ్చేస్తాయి. భయం లేకుండా వాటిని ఎంతో చాకచక్యంగా నిలువరిస్తూ ఎదురొడ్డి నిలబడతాడు. ఈ సీన్ చూస్తే మీకు తప్పనిసరిగా ఏదో సినిమాలో జరిగిన సీన్ చెబుతున్నా అనుకుంటారు ఏమో. బాలుడు ఏంటి కుక్కలను బెదిరించడం ఏంటని? కానీ ఇదే నిజం. మీరు నమ్మరనే పక్కా వీడియోతో సహా చూపిస్తున్నాం.
ఇదీ అసలు కథ : కూకట్పల్లిలోని మూసాపేట్ ఆంజనేయ నగర్లో ఈ సంఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి శ్రీకాకుళం బస్తీలో నివాసం ఉంటున్నారు. బంధువుల పెళ్లి నిమిత్తం కూకట్పల్లిలోని మూసాపేట్ వెళ్లారు. అక్కడ అతని కుమారుడు చందు, మరో చిన్నారి పూజ రోడ్డుపై ఆడుకుంటూ అర్ధరాత్రి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలోనే నాలుగు గ్రామ సింహాలు వీరిద్దరినీ చుట్టుముట్టాలని చూశాయి. చిన్నారి భయంతో పరుగులు తీయగా, బాలుడు అక్కడే నిలబడిపోయాడు. శునకాలు చుట్టుముట్టాయనే బెరుకులేకుండా బుడ్డోడు చందు ఎదురు నిలిచాడు. పైగా వాటినే బెదిరిస్తూ వెనక్కి వెళ్లాడు.
అంతలోనే మరో కుక్క చిన్నోడిపైకి వచ్చింది. దాన్ని కూడా చాకచక్యంగా ఎదురించాడు. ఇలా నాలుగు శునకాలను బెదిరించి అక్కడి నుంచి తరిమివేశాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రుల వద్దకు సేఫ్గా వెళ్లిపోయాడు. ఇది అంతా అక్కడే ఉన్న ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ రికార్డు అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2017లో ఘటన జరగగా, శునకాల దాడులు ఎక్కువైన నేపథ్యంలో తాజాగా నెట్టింట వైరల్గా మారింది. బాలుడి సాహసాన్ని చూసిన వారంతా ఈడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
లయన్స్ Vs డాగ్స్- గోశాల వద్ద పెద్ద ఫైట్- సింహాలను తరిమికొట్టిన కుక్కలు - Lions Vs Dogs Viral Video
కుక్కలు బాబోయ్ కుక్కలు - 10 ఏళ్లలో 3 లక్షల మందిని కరిచాయ్! - DOG BITE CASES IN HYDERABAD