Hyderabad Book Fair 2024 : హైదరాబాద్‌లో 37వ పుస్తక ప్రదర్శన తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 19 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు పుస్తక ప్రదర్శన సొసైటీ వెల్లడించింది. ఈ మేరకు సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ మాట్లాడుతూ, ఈసారి నిర్వహించే బుక్ ఫెయిర్‌కు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మెల్కొటే గౌరవ సలహాదారులుగా ఉంటారని వివరించారు. పుస్తక ప్రదర్శన కోసం మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే లాటరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
వారు ఐడీ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రవేశం : ఈ బుక్‌ఫెయిర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని అధ్యక్షుడు యాకూబ్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ సందర్శకులు పుస్తకాలు పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘సంచి’ని ఇస్తామని తెలిపారు. పుస్తక ప్రదర్శన కోసం రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు తమ ఐడీ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివరాల కోసం 9490099081ను సంప్రదించవచ్చని సూచించారు.
పిల్లలకు కథలు చదివి వినిపించిన తల్లిదండ్రులు- చైనా రికార్డ్ బ్రేక్
పుస్తక ప్రదర్శన లోగో ఆవిష్కరణ : ఈ సందర్భంగా గౌరవ సలహాదారులతో పాటు కమిటీ సభ్యులు పుస్తక ప్రదర్శనకు సంబంధించిన లోగోని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ సెక్రటరీ వాసు, కోశాధికారి నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కె.బాల్ రెడ్డి, శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీలు కె.సురేశ్, ఎం. సూరిబాబు, ఈసీ సభ్యులు జనార్దన్ గుప్తా, విజయారావు, మధుకర్, కోటేశ్వర రావు, శ్రీకాంత్, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తక ప్రియులూ ఫుల్లు భోజనం.. హైదరాబాద్ లో భారీ బుక్ ఫెయిర్
అక్షరాలతో సహవాసం ఎంతోమంది జీవితాల్ని మార్చింది... అదెలాగో తెలుసుకుందామా?