Bollywood Actress Case Update : ముంబయికి చెందిన సినీ నటిపై అక్రమ కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఆమెపై వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదులో కీలక సాక్షిగా పేర్కొన్న కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచ్ నాగేశ్వరరాజు అసలు ఆ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని తేల్చేశారు. తనతో పాటు, తన అల్లుడు బోరుకాటి భరత్‌కుమార్ ఆధార్ కార్డులను విద్యాసాగర్ దుర్వినియోగం చేసి, ఆ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్‌కూ లేఖ రాశారు.
జగ్గయ్యపేటలో తన ఐదెకరాల భూమిని కాదంబరీ జత్వానీకి విక్రయించినట్లు ఆమె ఫోర్జరీ పత్రాలు సృష్టించారన్నది కుక్కల విద్యాసాగర్ చేసిన ప్రధాన అభియోగం. ఆ భూమిని నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్‌కుమార్‌లకు ముంబయి నటి అమ్మజూపారని, వారి నుంచి అడ్వాన్సుగా 5 లక్షల రూపాయలు సైతం వసూలుచేశారని ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విద్యాసాగర్ పేర్కొన్నారు. వారిద్దరినీ సాక్షులుగా చేర్చారు. అప్పట్లో ఈ కేసులో నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌ల వాంగ్మూలాలను ఇబ్రహీంపట్నం పోలీసులు రికార్డు చేశారు. అయితే తమకు ఎవరూ ఆ భూమిని అమ్మజూపలేదని, తామెవరికీ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని తాజాగా చేసిన ఫిర్యాదులో స్పష్టంచేశారు. ఇందంతా చూస్తుంటే ముంబయి నటిపై పోలీసులు ఎంత అన్యాయంగా కేసు పెట్టారో అర్థమవుతోంది.
ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు - ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి - MUMBAI ACTRESS CASE
శ్రీవారి దర్శనం కోసం ఆధార్ కార్డులిస్తే: కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, విద్యాసాగర్ తండ్రి కుక్కల నాగేశ్వరరావు తమకు సన్నిహితులని, ఆయనపై తమకెంతో గౌరవముందని, కానీ ఆయన కుమారుడు విద్యాసాగర్‌తో తమకెలాంటి సంబంధాలు లేవని నాగేశ్వరరాజు కూచిపూడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంచేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖల కోసం తమ ఆధార్ కార్డుల నకళ్లను కుక్కల నాగేశ్వరరావు దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన గొరిపర్తి శ్రీనివాసరావుకు అందజేశామని, వాటిని దుర్వినియోగం చేసి ఆ కేసులో తమను ఇరికించారని నాగేశ్వరరాజు పేర్కొన్నారు.
‘‘నేను, నా అల్లుడు భరత్‌కుమార్ ముంబయి నటి నుంచి ఐదు ఎకరాలు కొన్నట్టు, 5 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించినట్టు మా ఆధార్‌కార్డులను ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ విషయం మాకు పోలీసులు, మీడియా ద్వారా తెలిసింది. మేం ఆ భూమిని కొనలేదు. అడ్వాన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. విద్యాసాగర్, శ్రీనివాసరావు కలసి మమ్మల్ని ఆ కేసులో ఇరికించారు. వారు చేసిన పనికి మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. వారిద్దరిపైన చర్యలు తీసుకోండి. ఈ కేసుతో మాకు సంబంధం లేదు. మాకు న్యాయం చేయండి’’ అని నాగేశ్వరరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ సీపీకి చేసిన ఫిర్యాదులోనూ ఈ విషయాలను ప్రస్తావించారు. చిందా నాగేశ్వరరాజు ఫిర్యాదుచేశారని, కానీ అది కూచిపూడి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన వ్యవహారం కాకపోవడంతో కేసు నమోదుచేయలేదని కూచిపూడి ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాగేశ్వరరాజు కంప్లైంట్‌పై విజయవాడ పోలీసుల్ని, న్యాయనిపుణుల్ని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు.