BJP MP Candidates List Telangana 2024 : రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ పార్టీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఎలాంటి వివాదాలకు తావులేని లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమైంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను సిట్టింగులకే కట్టబెట్టాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి(Kishan Reddy)ని, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌ను, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవిందను రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం.
BJP MP Tickets Telangana 2024 : మరో సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్‌లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి, జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ పార్లమెంట్ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఏడు స్థానాలకు బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాలో విడుదల చేసే అవకాశముంది.
BJP Focus On Lok Sabha Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీసీలకు 5 స్థానాలు తగ్గకుండా కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండటంపైనా ఫోకస్ పెట్టిన కమలం పార్టీ మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది.
మేం ఒంటరిగానే పోటీ చేస్తాం - పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆపే శక్తి ఎవరికీ లేదు : డీకే అరుణ
ఈ నెల 28న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్, మార్చి 5న నోటిఫికేషన్ రానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ ప్రకటించింది. దీంతో చివరి వరకు ఎవరు బరిలో ఉంటారోనన్నది సందిగ్థంగా మారింది. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు ఏమాత్రం అవకాశమివ్వొద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Lok Sabha Election In Telangana : ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉందనే వాదనలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకుని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు దృష్టి కేంద్రీకరించారు. ఎస్సీ రిజర్వ్‌గా ఉన్న నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ స్థానాలను గెలిచేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడితే ఈ మూడు స్థానాలను కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలు వేస్తోంది.
చేరికలు, బస్సు యాత్రలు, నారీ శక్తి వందన్‌తో ప్రజల్లోకి - ఫిబ్రవరి నెలంతా బీజేపీ బిజీబిజీ
తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన అన్ని స్థానాలకు తొలివిడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender MP Ticket) మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా అధిష్ఠానం మాత్రం మెదక్ నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోన్న రఘునందన్ రావుకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.
హిందుత్వ ఏజెండాతో జహీరాబాద్ నుంచి ఈ ఇద్దరిలో ఒకరిని పోటీ చేయించాలి అనుకుంటే ఈటలకే ఈ సీటు దక్కే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మెదక్ నుంచి ఈటల బరిలోకి దిగితే రఘునందన్ రావుకు అధిష్ఠానం మొండి చెయ్యి చూపిస్తుందని విశ్లేషకుల అంచనా. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐని బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా ఆశావహులతో పాటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుంది: కిషన్‌రెడ్డి
పది సీట్లే టార్గెట్ - నిత్యం జనంలో ఉండేలా రథయాత్రలు - బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్లాన్ ఇదే