BJP MLA Alleti Maheshwar Reddy Comments on CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అవినీతి కుంభకోణాల మీద ఆరోపణలు చేస్తే, ఒక్కదానికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన ఏలేటి, కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రూ.3 వేల కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, అందులో రూ.12 వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మేఘా కృష్ణారెడ్డికి కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్ట్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌కు చెందిన సోదా కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.3 వేల కోట్లను సోదా, కేఎన్ఆర్, మేఘా అనే మూడు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. కేఎన్ఆర్ కంపెనీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి భాగస్వామని తెలుస్తుందన్నారు. కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులిస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతుండగానే మేఘా కృష్ణారెడ్డికి కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్ట్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ కాంట్రాక్టర్ల నుంచే డబ్బులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.
మేఘా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానన్న రేవంత్ రెడ్డి, ఎందుకు విచారణకు అదేశించించడం లేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలపై రేవంత్ రెడ్డి విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అమృత్ పథకం నిధుల అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియాలో నిరుద్యోగులు, జర్నలిస్టులపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ 7 నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలి. అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన రూ.3 వేల కోట్ల నిధులలో దాదాపు రూ.12 వందల కోట్ల అవినీతి జరిగింది. అమృత్ పథకంలోని పనులను సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడి నుంచే డబ్బులు సమకూరుస్తున్నారు. -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత