Maheshwar Reddy Hot Comments : తమ ఎమ్మెల్యేలను ఒక్కరిని ముట్టుకున్నా, 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘటుగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అసలు మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీతో టచ్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డితో (KOMATI REDDY) పాటు మరో ఐదుగురు మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి, దిల్లీలో నితిన్ గడ్కరీని, అమిత్‌షాతో సమావేశమై షిందే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డిపై నమ్మకం లేక బీజేపీ పక్కన పెట్టిందని తెలిపారు. ఏ మంత్రి ఎప్పుడు తన సీటుకు ఎసరు తెస్తారోనని, సీఎం రేవంత్ రెడ్డికి భయంతో నిద్ర పట్టడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Maheshwar Reddy fires on komati reddy : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంలో ఉందని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. సీఎం హోదాలో ఉండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. టెలిఫోన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తిన మహేశ్వర్ రెడ్డి, ఆర్ అంటే రేవంత్ ట్యాక్సా లేక రాహుల్ ట్యాక్సా లేక రాజీవ్ ట్యాక్సా ఏంటో తమకు తెలియడం లేదని దుయ్యబట్టారు. రేవంత్ వసూళ్ల చిట్టా బీజేపీ నాయకుల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ డబ్బును దేశ రాజకీయాలకు వాడుతున్నట్లు ఆయన ఆరోపించారు. భువనగిరి సీటును బీజేపీ రెండు లక్షల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
"మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దిల్లీలో నితిన్ గడ్కరీ, అమిత్‌షాతో సమావేశమై షిందే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఏ మంత్రి తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెస్తారోనని రేవంత్‌రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారు". - మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత