Eleti Maheshwar Reddy key comments on CM Revanth Reddy : రాష్ట్రంలో దొంగలు పడ్డారు, పట్టపగలే దోచుకుంటున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అమృత్ నిధులకు సంబంధించి అవినీతి టెండర్లను రద్దు చేసి, గ్లోబల్ టెండర్లను పిలవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తెలియకుండా దొంగ జీవోలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పనులన్నీ ఏపీ గుత్తేదారులకు ఇస్తున్నారని గతంలో విమర్శించారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా అంటూ ప్రశ్నించారు. చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దొంగలు పోయి, గజదొంగలు వచ్చినట్లుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతి చీకటి ఒప్పందాలతో అవినీతి మయం అయ్యిందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జవాబుదారీతనం, పారదర్శకత లేని ప్రభుత్వం నడుస్తుందన్నారు. ప్రజా దర్బార్ కానరాకుండా పోయిందని విమర్శించారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తోందని తెలిపారు. రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ( BRU )ట్యాక్స్‌లతో అవినీతి నిండిందన్నారు.
'అవినీతి టెండర్లు రద్దు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవాలి. టెండర్లను రద్దు చేస్తే 12 వందల కోట్లు రాష్ట్ర ఖజానాకి మిగులుతుంది. రాష్ట్ర ఖజానాను దోస్తున్న వారు సీఎం దోస్తులా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన గుత్తేదారులా. వారం రోజుల్లో టెండర్లు రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. టెండర్లలో రూ.12 వందల కోట్ల కుంభకోణం జరిగింది. రేవంత్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబెడతాం.-' ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మేఘ కృష్ణారెడ్డిని జైలుకు పంపిస్తామన్నారని, అదే మేఘకు 40 శాతం ఎక్కువతో టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర అమృత్ నిధులు గ్లోబల్ టెండర్లు లేకుండా ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30 శాతం తక్కువకు చేసేందుకు కంపెనీలు ముందుకి వస్తాయన్నారు. గ్లోబల్ టెండర్లు చేయకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సిద్దం అవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
Alleti Maheshwar Reddy: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరిన మహేశ్వర్‌రెడ్డి