BJP Kisan Morcha Cleaning Temples due to Tirumala Laddu Issue : 'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ కిసాన్‌మోర్చా గోమాత పూజలు చేపట్టింది. పరిశుద్ధ కార్యక్రమాల పేరుతో శనివారం నాడు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను వారు పునఃశుద్ధి చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బలగమెుట్టు ప్రాంతంలో ఉన్న శివాలయం వద్దకు ఆవును తీసుకెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఆధ్వరంలో శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల వల్లనే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో కలుషిత నెయ్యి ఉపయోగించారని మండిపడ్డారు.
పూజలు చేయటం విడ్డూరంగా ఉంది : అత్యున్నత ప్రమాణాలు కలిగిని ఎన్డీడీబీ(NDDB) ల్యాబ్ రిపోర్టులో సైతం ఇదే నిరూపితం అయ్యిందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నరని తెలిపారు. తప్పు చేసిన దానికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నీచ రాజకీయాలు చేస్తుంది విమర్శించారు. అన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేయటం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు.
దేవాలయాలకు వచ్చి నాటకాలు : విజయవాడ లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నేతృత్వంలో గోమూత్రంతో శుద్ధి చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ నేతలు తిరుమలను అపవిత్రం చేశారని ఆరోపించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడి తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని మండిపడ్డారు. తద్వారా కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నాయకులు లడ్డూను అపవిత్రం చేసిందే కాక తప్పును కప్పిపుచ్చుకునేందుకు దేవాలయాలకు వచ్చి నాటకాలు ఆడారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ దీక్షకు మద్దతుగా శాంతి హోమం : తిరుమల లడ్డూను అపవిత్రం చేసి వైఎస్సార్సీపీ పాలకులు హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని హిందూ ధర్మరక్ష సమితి సభ్యులు అన్నారు. ప్రసాదం తయారీలో జరిగిన దోష నివారణ కోసం విజయనగరం కోట వద్ద అపరాధ పరిహార పూజను నిర్వహించారు. హిందూ దేవాలయాల్లో హిందువుల మనోభావాలను గౌరవించే వాళ్లని సిబ్బందిగా నియమించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జనసేన నేతలు శాంతి హోమం నిర్వహించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు నిరసనగా డిప్యూటీ సీఎం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శాంతి హోమం చేయించారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.