BJP MP Laxman Speech on Telangana Formation Day 2024 : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కమలం పార్టీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు.
'తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ఆనాడు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ లోక్‌సభ, రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారు. 1200ల మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి బలి దేవత అన్నారు. సీఎం అయ్యాక బలి దేవతను ఎట్లా ఆరాధిస్తున్నారు' అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
Telangana Decade Celebrations 2024 : కేసీఆర్ ప్రభుత్వం కవులు కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందని లక్ష్మణ్ ఆరోపించారు. వేడుకల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజకీయ వివాదాలు సృష్టించి కాలం గడుపుతున్నారని విమర్శించారు. దీనిపై కోదండరాం నోరు మెదపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌ను విస్మరిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.
"తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పడం సరైంది కాదు. సకల జనులు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. నీళ్ల పేరు మీద కేసీఆర్ సర్కార్ మోసం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్ అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్‌ను గద్దె దించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్‌తో రేవంత్‌రెడ్డి లాలూచిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదు. మోదీ వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలగాలి : ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలగాలని లక్ష్మణ్ అన్నారు. కవులు కళాకారులు, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రికి ఈ ఐదేళ్లు కష్టంగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ వేడుకలుగా జరుపుకోవడం సరైంది కాదని తెలిపారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అలాగే కోదండరాం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
Telangana Formation Day 2024 : ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీలో కమలం పార్టీ చేరిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. పార్టీ జెండాలు పక్కనపెట్టి, తెలంగాణ అజెండా కోసం పోరాడామని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందని ఆరోపించారు. ఓట్ల వేటలో ప్రజలను హస్తం పార్టీ మభ్యపెట్టిందని విమర్శించారు. ఉద్యమకారులను బీజేపీ సత్కరిస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులను లక్ష్మణ్ సన్మానించారు.