Bhadrachalam Godavari water level Rising : భద్రాచలం వద్ద గోదావరికి వరద మరోసారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం నుంచి నీటిమట్టం పెరుగుతూ ప్రవహిస్తున్న గోదావరి, మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రస్తుతం 46.1 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఇవాళ ఉదయం గోదావరి ప్రవాహం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో ఐదు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది.
నీటిమట్టం పెరగడంతో స్నానగట్టాల వద్ద కల్యాణ కట్ట ప్రాంతం వద్ద చాలా మెట్లు వరదనీటిలో మునిగాయి. గోదావరి దిగువన ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి వరద అంతకంతకూ ఉద్ధృతంగా పెరుగుతూ వస్తోంది.
లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : ఇంకా నీటిమట్టం పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల వరద నీరు, ఇంద్రావతి నుంచి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు 10 లక్షల 32 వేల 816 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది.