Bathukamma Festival Flowers History : పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. ప్రకృతి ప్రసాదించిన బతుమ్మ పండగలో యువతులు, మహిళలు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేస్తారు. తొమ్మిది రోజులు ఆడిపాడుతూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ వేడుకలో బతుకమ్మ తయారు చేయడానికి వాడే తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి.
ఆరోగ్యానికి దోహదం : ఈ క్రమంలో ఈ పూల నుంచి వెలువడే సువాసనలు, వాటి స్పర్శ బతుకమ్మ ఆడే మహిళల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఉత్సవంలో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం దాగి ఉందని శాస్త్రీయంగా రుజువైంది. ఈ విషయాలేంటో తెలుసుకుందాం.
ఈ సీజన్‌లో తంగేడు, మందార, బంతి, గుమ్మడి, , గునుగు, చామంతి, తామర, అల్లి, గడ్డిపువ్వు, వామపువ్వు, కట్ల, టేకు, స్వస్తీకం, సీతజడలు, బీర, కాకర, దోస, తదితర పూలు వికసిస్తాయి. ఈ పూలు సగంధ వాసనను విరబూస్తూ, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
బంతిపూలు : బంతిపూల సుగంధ వాసన జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పూల తైలం రక్తస్రావం తగ్గడానికి, కేశాలు పెరగడానికి ఔషధంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.కడుపులోని నులి పురుగుల వ్యాధి నివారణకు వాడతారు.
గునుగు : గునుగు పువ్వులను క్షయ, అతిసార వ్యాధుల నివారణకు ఔషధంగా వాడతారు. ఈ పూల పొడి పెద్ద పేగులోని బద్దె పురుగులను తొలగించడానికి, కంటి సంబంధ రోగ నివారణకు ఉపయోగిస్తారు. మధుమేహం, నోటి పుండ్లు, ముక్కులో రక్తస్రావం తగ్గడానికి ఉపయోగిస్తారు. రక్తపోటును అదుపులో పెడుతుంది.
తంగేడు : దీని ఆకులు, పువ్వుల చూర్ణాన్ని కామెర్లు, తామర లాంటి చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. చెక్కను ఉదరకోశ వ్యాధులకు మందుగా, కళ్లకలక నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు.
గడ్డిపువ్వు : గడ్డి పువ్వును ఆయుర్వేద వైద్యంలో యాంటిబయాటిక్‌గా వాడతారు. రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో, తండాల్లో, పల్లెల్లో ఈ పూలరసాన్ని ఉపయోగిస్తున్నారు.
కాకర పూలు : కాకర కాయ, వాటి పూలు మధుమేహ వ్యాధిగ్రస్థులకు దివ్యౌషధంగా పని చేయడమే కాకుండా వారి మానసిక స్థితిని ఉత్సాహంగా ఉంచుతుంది. యాంటిబయాటిక్స్ మందుల తయారీలో కాకర పూల తైలాన్ని ఉపయోగిస్తుంటారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
చామంతి : చామంతి పూలతో చర్మ సమస్యలు దూరమవుతాయి. జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గడానికి దోహదం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడిని తగ్గిస్తాయి.
గుమ్మడి : శరీర ఉష్ణోగ్రత సమతుల్యం ఉంచేందుకు వీటి పూలు ఆయుర్వేద వైద్యంలో వాడతారు. గుమ్మడి పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పూలలో ఎ-విటమిన్ అధికంగా ఉండటంతో కంటి సంబంధిత రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. దగ్గు, జలుబు, వైరల్ జ్వరం తగ్గేందుకు వీటి పూలను మందుగా వాడతారు.
"బతుకమ్మలో వాడే పూలు మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ఆ పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం తయారీలో వాటిని వాడతారు. మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడే సందర్భంలో పూలనుంచి వచ్చే సువాసన, వాటి తాకిడితో జ్ఞానేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. పూలను చూడటంతో కంటి చూపు బాగు పడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ నవరాత్రులు బతుకమ్మ ఆడే క్రమంలో వారికి తెలియకుండానే కొన్ని రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. వర్షాకాలంలో వాగులో, నదిలో కొత్త నీరు చేరుతుంది. సామూహికంగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో హానికారక క్రిమికీటకాలు నశిస్తాయి. కొన్ని పూలు నీటిని శుద్ధి చేసి జలజీవులను బతికిస్తాయి. నైవేద్యాన్ని సమర్పించడంతో నీటిలోని జీవులకు అవి ఆహారంగా అవుతాయి."-డా.అనికేత్ వైద్య, ఆయుర్వేద వైద్య నిపుణులు
ఎవరీ బతుకమ్మ? ఎందుకు పండగలా జరుపుకుంటారు? అసలు విషయమేంటి? - Bathukamma Festival 2024