Arrangements for CM Jagan Kanigiri Tour: సీఎం జగన్ సభలన్నా, బస్సు యాత్రలన్నా, రోడ్డు షోలన్నా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వెళ్లే మార్గంలో పచ్చని చెట్లు, విద్యుత్ తీగలు తొలగించేస్తున్నారు. నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలోని కనిగిరి పర్యటన కోసం స్థానిక అధికారులు విద్యుత్ తీగలను తొలగించారు.
జగన్ బహిరంగ సభ నిర్వహించే స్థానిక పామూరు బస్టాండ్ కూడలిలో విద్యుత్ వైర్లు, సర్వీస్ తీగలను తొలగించారు. సీఎం పర్యటించే రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.
సీఎం జగన్ పర్యటన అంటే ఆయన పర్యటించే ప్రాంతం మొత్తం పచ్చదనమే లేకుండా చేసి ఎడారిగా మార్చిన అనంతరమే ప్రారంభమవుతుంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి కనిగిరిలో సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతంతో పాటు పలు ప్రధాన రహదారుల వెంబడి పార్టీ శ్రేణులు వందల కొద్దీ అరటి పిలకలతో పచ్చదనాన్ని సృష్టించారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నీడనిచ్చే పచ్చని పెద్ద పెద్ద వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేయించే సీఎం జగన్ ఇప్పుడు పద్ధతి మార్చుకొని అందుకు భిన్నంగా పచ్చదనం ఉట్టి పడినట్లు కనిపించేలా సాయంత్రానికి వాడిపోయే వందలకొద్ది అరటి పిలకలను రహదారి వెంబడి కట్టడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. పచ్చదనాన్ని ఓర్చలేని జగన్ ఏ విధంగానైనా పచ్చని చెట్ల ప్రాణాలను నిలువునా తీస్తున్నాడని చర్చించుకుంటున్నారు.