Army Started Work at Budameru Canal : బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో భారీ వరదలు పోటెత్తి విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. బుడమేరు వాగుపై గండ్లు పూడ్చే పనులు పగలురాత్రీ తేడా లేకుండా నిరాటంకంగా సాగుతున్నాయి. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు సారథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు యుద్ధప్రాతిపదికన రెండ్లు గండ్లను పూడ్చివేశారు. సైన్యం సహకారంతో మూడో గండి పూడ్చివేతకు ముందుకు సాగుతున్నారు. గండ్లు వద్ద సమస్య పరిష్కరించేందుకు ఆర్మీ పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు.
బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉందని తెలిపింది. వీటిని గేబియాన్ బుట్టలతో పూడ్చుతామని, మొదట గేబియాన్ బుట్టలు పేర్చి, తర్వాత అందులో రాళ్లు వేస్తామని మిలిటరీ అధికారులు వివరించారు. ఈ మేరకు బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తామన్నారు. గేబియాన్ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోందన్న ఆర్మీ, ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతామని తెలిపింది. అదేవిధంగా ఈ ఆపరేషన్‌లో గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్ బృందం పనిచేస్తోందని మిలిటరీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.3,448 కోట్ల ఆర్థిక సాయం - central govt announce flood relief